అన్నదాతను ముంచిన విత్తన పత్తి కంపెనీలు | - | Sakshi
Sakshi News home page

అన్నదాతను ముంచిన విత్తన పత్తి కంపెనీలు

Jul 2 2025 5:12 AM | Updated on Jul 2 2025 5:12 AM

అన్నద

అన్నదాతను ముంచిన విత్తన పత్తి కంపెనీలు

రైతు పేరు శివన్న. అమరాపురం మండలం కొర్రేవు గ్రామం. విత్తన కంపెనీల కోరిక మేరకు తన ఐదుఎకరాల వ్యవసాయ భూమిలో విత్తన పత్తి సాగు చేశారు. పంట సాగుకు దాదాపు రూ.3 లక్షల వరకు ఖర్చు పెట్టారు. దిగుబడి చేతికొచ్చే సమయానికి విత్తన కంపెనీలు ప్లేటు ఫిరాయించాయి. విత్తనాలను పూర్తిస్థాయిలో కొనుగోలు చేయబోమని తేల్చిచెప్పాయి. కడుపు మండిన శివన్న ఎకరా విస్తీర్ణంలోని విత్తన పత్తి మొక్కలను పీకేశారు. బంగారు నగలు తాకట్టు పెట్టి పంట సాగుచేశానని, ఇప్పుడు కొనుగోలు చేయకపోతే ఆత్మహత్యనే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం ఆదుకునేనా?

విత్తన పత్తి సాగు చేసిన మడకశిర రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి అక్కడి విత్తన కంపెనీలు ఇచ్చిన మాట ప్రకారం పూర్తి స్థాయిలో రైతుల నుంచి విత్తనాలను కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. లేకపోతే ప్రభుత్వమే పత్తి విత్తనాలను రైతుల నుంచి కొనుగోలు చేసి ఆదుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు.

మడకశిర: విత్తన పత్తి (సీడ్‌ పత్తి) సాగుకు మడకశిర నియోజకవర్గం పెట్టింది పేరు. కానీ ఈసారి విత్తన పత్తి సాగు చేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దిగుబడి తామే కొనుగోలు చేస్తామంటూ హామీ ఇచ్చి సాగును ప్రోత్సహించిన పత్తి విత్తన కంపెనీలు ఇప్పుడు మాటమార్చడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.

కంపెనీల సహకారం.. పెరిగిన సాగు విస్తీర్ణం

మామూలు పత్తితో పోలిస్తే విత్తన పత్తితో ఎక్కువ లాభాలుంటాయి. పెట్టుబడులు పోను ఎకరాకు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఆదాయం ఉంటుంది. దీంతో రైతులు కొన్నేళ్ల నుంచి విత్తన పత్తి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. నియోజకవర్గానికి ఆనుకుని ఉన్న కర్ణాటక రాష్ట్రంలోని శిర, హిరియూర్‌, చెళ్లికెర, మధుగిరి, హొసదుర్గ, చిక్కనాయకనహళ్లి నియోజకవర్గాల్లోని రైతులు ఎక్కువగా విత్తన పత్తి సాగు చేసేవారు. వారిని చూసి మడకశిర నియోజకవర్గంలోని రైతులు కూడా విత్తన పత్తి వైపు దృష్టి సారించారు. దీంతో ఆయా విత్తన కంపెనీలు కూడా రైతులకు పూర్తి సహకారం అందిస్తూ వచ్చాయి. ముందుగానే పత్తి విత్తనాలకు ధర నిర్ణయించడంతో పాటు దిగుబడి వారే కొనుగోలు చేసేవారు. అంతేగాక రైతులకు ముందుగానే కొంత నగదును ఆడ్వాన్స్‌ ఇచ్చేవారు. పంట సాగుకు అవసరమైన మందులు, ఎరువులు, విత్తనాలను కూడా కంపెనీలే సరఫరా చేసేవి. దీంతో మడకశిర నియోజకవర్గంలో ఏటికేడు విత్తన పత్తి సాగు విస్తీర్ణం పెరుగుతూ వచ్చింది. గత ఏడాది ఖరీఫ్‌లో క్వింటాల్‌ పత్తి విత్తనాలు రూ.50 వేలు పలకగా, రైతులంతా విత్తన పత్తిపై దృష్టి సారించారు.

చేతులెత్తేసిన కంపెనీలు

ఈ ఏడాది ఖరీఫ్‌లో కూడా విత్తన పత్తి సాగుకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని విత్తన కంపెనీల ప్రతినిధులు చెప్పడంతో రైతులు మరోసారి విత్తన పత్తి సాగు చేశారు. విత్తనం, ఎరువులు, మందులు కంపెనీలే అందించాయి. అయితే ప్రస్తుతం విత్తన కంపెనీల ప్రతినిధులు పత్తి విత్తనాలను పూర్తి స్థాయిలో కొనుగోలు చేయబోమని చెబుతున్నారు. ఎకరాకు రెండున్నర క్వింటాళ్ల విత్తనాలను మాత్రమే కొనుగోలు చేస్తామని తేల్చిచెప్పారు. అయితే ఇప్పటికే రైతులు విత్తన పత్తి పంటపై పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం ఆడ, మగ పువ్వులను పంట సాగు ప్రక్రియలో క్రాస్‌ చేస్తున్నారు. ఈ ప్రక్రియ రెండు నెలల పాటు సుదీర్ఘంగా జరగాలి. ఇందుకు కూలీలకు రోజుకు రూ.400 చెల్లించాల్సి ఉంటుంది. అన్నీ సవ్యంగా సాగితే ఎకరాకు 9 క్వింటాళ్ల పంట చేతికి అందుతుంది. ప్రస్తుతం క్వింటాల్‌ పత్తి విత్తనాల ధర రూ.45 వేలు ఉండగా.. రైతుకు సుమారు రూ.4 లక్షలకుపైగా చేతికి అందుతుంది. పెట్టుబడి పోను రూ.3 లక్షలు మిగులుతాయి. అయితే పంట చేతికొచ్చే సమయంలో విత్తన కంపెనీలు చేతులెత్తేశాయి. ఎకరాకు రెండున్నర క్వింటాళ్లే కొంటామని చెప్పడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. గిట్టుబాటు కాదని భావిస్తున్న కొందరు రైతులు పంటను పీకేస్తున్నారు. మరికొందరు గొర్రెలు, మేకలను వదిలి మేపుతున్నారు.

విత్తన పత్తి సాగుకు కంపెనీల ప్రోత్సాహం

పంట తామే కొనుగోలు చేస్తామని

మొదట్లో భరోసా

దిగుబడి చేతికందే సమయంలో

మాటమార్చిన వైనం

ఎకరాకు రెండున్నర క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని మెలిక

మిగిలిన పంటను ఏం చేసుకోవాలని వాపోతున్న రైతాంగం

విత్తనాలన్నీ కొనాలి

నేను ఒకటిన్నర ఎకరాలో విత్తన పత్తిని సాగు చేశా. దాదాపు 9 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం విత్తన కంపెనీలు పూర్తి స్థాయిలో విత్తనాలను కొనుగోలు చేయబోమని చెబుతున్నాయి. మిగిలిన విత్తనాలను ఎక్కడ అమ్ముకోవాలో అర్థం కావడం లేదు. విత్తన కంపెనీలు చెప్పిన మేరకు విత్తనాలన్నీ కొనుగోలు చేయాలి. లేకపోతే రైతులు పూర్తిగా నష్ట పోవాల్సి ఉంటుంది.

– శ్రీనివాస్‌, హెచ్‌టీహళ్లి, రొళ్ల మండలం

కంపెనీలు మోసం చేశాయి

విత్తన కంపెనీలు మోసం చేస్తున్నాయి. మొదట పూర్తి స్థాయిలో విత్తనాలు కొనుగోలు చేస్తామని చెప్పాయి. పంట సాగు చేసిన తర్వాత ఎకరాకు రెండున్నర క్వింటాళ్లే కొనుగోలు చేస్తామని చెబుతున్నాయి. నేను మూడెకరాల్లో విత్తన పత్తి వేశా. దాదాపు 24 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఇందులో ఏడున్నర క్వింటాళ్లను మాత్రమే కొనుగోలు చేస్తామని అంటున్నారు. మిగిలిన విత్తనాలను ఎక్కడ అమ్ముకోవాలో తెలియడం లేదు. విత్తన కంపెనీల మోసంతో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. –ఇంతియాజ్‌,

బసవనపల్లి, అమరాపురం మండలం

అన్నదాతను ముంచిన విత్తన పత్తి కంపెనీలు 
1
1/4

అన్నదాతను ముంచిన విత్తన పత్తి కంపెనీలు

అన్నదాతను ముంచిన విత్తన పత్తి కంపెనీలు 
2
2/4

అన్నదాతను ముంచిన విత్తన పత్తి కంపెనీలు

అన్నదాతను ముంచిన విత్తన పత్తి కంపెనీలు 
3
3/4

అన్నదాతను ముంచిన విత్తన పత్తి కంపెనీలు

అన్నదాతను ముంచిన విత్తన పత్తి కంపెనీలు 
4
4/4

అన్నదాతను ముంచిన విత్తన పత్తి కంపెనీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement