
సామాజిక భద్రతే ప్రభుత్వ లక్ష్యం
● పింఛన్ల పంపిణీలో కలెక్టర్ టీఎస్ చేతన్
పుట్టపర్తి టౌన్: ప్రతి ఒక్కరికీ సామాజిక భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ చేతన్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువు మండలం తలమర్ల గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారులతో వ్యక్తిగతంగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గాయత్రీదేవి, ఎంపీడీఓ నటరాజ్ పాల్గొన్నారు.
జిల్లాలో 93.16 శాతం పింఛన్లు పంపిణీ
తొలిరోజు మంగళవారం జిల్లాలో 93.16 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేసినట్లు డీఆర్‌డీఏ పీడీ నరసయ్య తెలిపారు. తెల్లవారుజాము నుంచే సచివాలయ అధికారులు సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారన్నారు. ఫలితంగా తొలి రోజు 2,60,883 పింఛన్లకు గాను 2,44,010 పింఛన్లు పూర్తి చేశారని వివరించారు. మిగిలిన పింఛన్లను బుధవారం పంపిణీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
బాలుర ఫుట్‌బాల్ విజేత ‘శ్రీసత్యసాయి’
మదనపల్లె సిటీ: అన్నమయ్య జిల్లా మదనపల్లె సమీపంలోని వేదా పాఠశాలలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి జూనియర్ బాలుర ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో శ్రీసత్యసాయి జిల్లా జట్టు సత్తా చాటి విజేతగా నిలిచింది. మూడు రోజులుగా పోటాపోటీగా జరుగుతున్న పోటీల్లో శ్రీసత్యసాయి జిల్లా జట్టు ఒక్కో దశను దాటుకుంటూ ఫైనల్స్‌కు చేరింది. మంగళవారం ఫైనల్స్‌లో తిరుపతి జట్టుతో తలపడి విజయం సాధించింది. చివరివరకూ పోరాడిన తిరుపతి జట్టు రన్నరప్‌గా సరిపెట్టుకుంది. తృతీయ స్థానంలో అనంతపురం జట్టు నిలిచింది. ఈ టోర్నమెంటులో ప్రతిభ కనబరచిన క్రీడాకారులను ఎంపిక చేసి ఈనెల మూడో వారంలో అమృతసర్‌లో జరిగే జాతీయ స్థాయి టోర్నమెంట్‌కు పంపనున్నట్లు ఫుట్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దిలీప్‌కుమార్, మురళీధర్ తెలిపారు. విజేతలకు వేదా పాఠశాల కరస్పాండెంట్ రామలింగారెడ్డి, పోతబోలు సర్పంచు ఈశ్వరయ్య ట్రోఫీ, మెడల్స్ అందజేశారు. కార్యక్రమంలో కోచ్‌లు సిరాజ్, చినబాబు, శ్రీనివాస్, మహేంద్ర, కమలేష్, బాలాజీ, నరేంద్ర పాల్గొన్నారు.

సామాజిక భద్రతే ప్రభుత్వ లక్ష్యం