
‘పీఆర్‌సీని నియమించాలి’
కదిరి అర్బన్: పే రివిజన్ కమిషన్ (పీఆర్‌సీ) ఏర్పాటు చేసి, తక్షణమే మధ్యంతర భృతి ప్రకటించాలని ప్రభుత్వాన్ని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు హరిప్రసాదరెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక జెడ్పీహెచ్‌ఎస్‌లో ఆదివారం ఉపాధ్యాయులతో ఆయన సమావేశమై మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు కూటమి పెద్దలు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్‌లో ఉన్న డీఏలు, ఐఆర్‌లను ప్రకటించాలన్నారు. పీఆర్‌సీని నియమించి నిర్ణీత కాల పరిమితి లోపు నివేదిక తెప్పించుకుని వీలైనంత త్వరగా 12వ పీఆర్‌సీని అమలు చేయాలన్నారు. పీఆర్‌సీ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో వెంటనే 30 శాతం ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా డీఏలను మంజూరు చేయాలన్నారు. దీర్ఘకాలికంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. సమావేశంలో జిల్లా నాయకులు జాఫర్,ప్రసాద్, రవినాయక్, ఖలీల్, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
దంపతులపై హత్యాయత్నం కేసులో కుమారుడి అరెస్ట్
బత్తలపల్లి: దంపతులపై హత్యాయత్నానికి పాల్పడిన కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలను బత్తలపల్లి పీఎస్ ఎస్‌ఐ సోమశేఖర్ వెల్లడించారు. బత్తలపల్లి మండలం గంటాపురం గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు జాంపుల అప్పస్వామి, లక్ష్మీదేవి.. భవిష్యత్తు అవసరాల కోసమని కొద్ది మేర డబ్బు దాచుకున్నారు. వీరి కుమారుడు సురేష్‌బాబు అలియాస్ బాబుల్లా మద్యానికి బానిస. మద్యం తాగేందుకు డబ్బు కోసం తరచూ తల్లిదండ్రులను వేధించేవాడు. ఈ క్రమంలో 2023, నవంబర్ 22న మద్యం తాగేందుకు తనకు డబ్బు ఇవ్వాలని తల్లిదండ్రులను వేధించాడు. తమ వద్ద లేదని వారు చెప్పడంతో అర్ధరాత్రి 11 గంటల సమయంలో కొడవలితో దాడి చేశాడు. క్షతగాత్రుల ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్‌ఐ శ్రీనివాసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న సురేష్‌బాబు.. ఆదివారం గంటాపురం క్రాస్‌లో తచ్చాడుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.