
సజావుగా వీఆర్‌ఓల బదిలీల కౌన్సెలింగ్
అనంతపురం అర్బన్: కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో ఆదివారం చేపట్టిన చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయాల గ్రేడ్–2 వీఆర్‌ఓల బదిలీల కౌన్సిలింగ్ సజావుగా జరిగింది. మొత్తం 328 మంది హాజరు కాగా, ఒకే చోట ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్నవారు 121 మంది ఉన్నారు. మరో 53 మంది రిక్వెస్ట్ బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ బదిలీ కౌన్సెలింగ్‌ను డీఆర్‌ఓ ఎ.మలోల, అనంతపురం. శ్రీసత్యసాయి జిల్లాల కలెక్టరేట్ పరిపాలనాధికారులు అలెగ్జాండర్, వెంకటనారాయణ నిర్వహించారు. ఎస్‌ఆర్‌లు, ఇతర పత్రాలను డిప్యూటీ తహసీల్దార్లు మూర్తి, లీలాకాంత్ పరిశీలించారు. ఇదిలా ఉండగా ఉదయం 11గంటలకు మొదలు కావాల్సిన బదిలీల కౌన్సెలింగ్ మధ్యాహ్నం 2.30 గంటలకు మొదలు కావడంతో చంటిపిల్లలతో వచ్చిన మహిళా వీఆర్‌ఓలు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు.
పోలీసుల అదుపులో
దోపిడీ కేసు నిందితుడు?
హిందూపురం: మండలంలోని కిరికెర వద్ద వెంకటాద్రి లే అవుట్‌లో నివాసముంటున్న సిమెంట్ వ్యాపారి నిత్యానందారెడ్డి ఇంట్లో చోటు చేసుకున్న దోపిడీకి సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకుని, కారును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ కేసును సీఐ ఆంజనేయులు పర్యవేక్షణలో వివిధ కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నారు. ఇప్పటికే పాత నేరస్తులను, అనుమానితులను విచారణ చేశారు. సంఘటన జరిగినప్పుడు హిందూపురం, బెంగళూరు ప్రాంతాల్లో ప్రయాణించిన వాహనాలు, సెల్‌ఫోన్ కాల్ డేటాలను సేకరించి దాని ఆధారంగా దొంగలు ఢిల్లీ ప్రాంతంలో ఉన్నట్లుగా గుర్తించినట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఓ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిసింది.