
పారదర్శకంగా ఇసుక సరఫరా
ప్రశాంతి నిలయం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత ఇసుక పాలసీని పారదర్శకంగా అమలు చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా స్థాయి ఉచిత ఇసుక సరఫరా అమలు కమిటీ సమావేశం జరిగింది. కమిటీ చైర్మన్, కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పారదర్శకంగా ఉచిత ఇసుక సరఫరాను పటిష్టంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇసుక రవాణా చేసే అన్ని వాహనాలు ఉచిత ఇసుక రవాణా వాహనం అన్న బ్యానర్‌తో ఉండాలన్నారు. అలాగే జీపీఎస్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇసుక సరఫరా కేంద్రాల వద్ద సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. అంతర్ రాష్ట్ర ఇసుక అక్రమ రవాణాను నిరోధించేందుకు పోలీసులు సమన్వయంతో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులలో పర్యవేక్షణను కట్టుదిట్టం చేయాలన్నారు. ఉచిత ఇసుక విధానాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం జిల్లాలో ఉన్న ఇసుక రీచ్‌లు, ఇసుక తవ్వకాలు తదితర అంశాలపై కలెక్టర్ చర్చించారు. జిల్లాలో ఎక్కడా కూడా అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణా జరగకుండా చర్యలు అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో జిల్లాస్థాయి ఇసుక కమిటీ సభ్యులతో పాటు ఎస్పీ రత్న, వైస్ చైర్మన్, జాయింట్ కలెక్టర్ అభిషేక్‌కుమార్, భూగర్భశాఖ అధికారి పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్ చేతన్