
జీజీహట్టిలో కొలిక్కిరాని అతిసారం
రొళ్ల: పది రోజులుగా రొళ్ల మండలం జీజీహట్టి గ్రామాన్ని వేధిస్తున్న అతిసారం మరోసారి తన ఉనికిని చాటింది. ఇప్పటికే దాదాపు 40 మంది అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. ఇందులో అమూల్య (11) మృతి చెందింది. మరికొందరు కోలుకొంటున్నారు. తాజాగా మంగళవారం గ్రామానికి చెందిన శశికళ, చిక్కమ్మ, దొడ్డపూజారప్ప గారి మారన్న అతిసారం బారిన పడడంతో వైద్య, ఆరోగ్య శాఖ ఉలిక్కిపడింది. ఆగమేఘాలపై గ్రామానికి డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ మంజువాణి, తహసీల్దార్ షెక్సావలి, ఎంపీడీఓ రామారావు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మారన్నను మధుగిరిలోని ఆస్పత్రికి, శశికళ, చిక్కమ్మను రొళ్లలోని సీహెచ్‌సీకి తరలించారు. అలాగే అతిసారం లక్షణాలతో బాధపడుతున్న చిక్కీరప్పను హిందూపురం, ఈరమ్మను మడకశిరలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఓ వ్యవసాయ బోరుబావిలో నీటిని తాగడం వలనే వాంతులు, విరేచనాలతో ప్రజలు బాధపడుతున్నట్లుగా గుర్తించిన అధికారులు సదరు రైతుకు నోటీసులు జారీ చేశారు. ప్రజలెవ్వరూ ఆ నీటిని వినియోగించరాదంటూ హెచ్చరికలు జారీ చేశారు. అధికారులు ఇంటింటికీ తిరిగి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.