
టీడీపీ నేతల దౌర్జన్యకాండ
హిందూపురం టౌన్: లేపాక్షి మండలం కోడిపల్లిలో టీడీపీ నాయకులు దౌర్జన్యకాండతో చెలరేగిపోతున్నారని, తరచూ దాడులు చేయడమే కాక అక్రమంగా కేసులు బనాయిస్తూ చిత్రహింసలకు గురి చేస్తున్నారని రజియాభాను, బాబాఫకృద్దీన్ దంపతులు ఆరోపించారు. ఆదివారం హిందూపురంలోని ప్రెస్‌క్లబ్‌లో కుమారుడు జబీవుల్లాతో కలిసి దంపతులు విలేకరులతో తమ గోడు వెల్లబోసుకున్నారు. వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగించే తమ కుటుంబంపై ఎంపీటీసీ గంగాధర్, టీడీపీ నాయకులు నాగరాజు, ఆనంద్‌రెడ్డి, గోపీ తదితరులు కక్ష కట్టి దాడులకు పాల్పడుతున్నారన్నారు. నెల క్రితం నాగేపల్లివద్ద ఉన్న అనధికారిక బార్ అండ్ రెస్టారెంట్ వద్ద తమ గ్రామానికి చెందిన సుభాష్, శ్రీకాంత్ అనే వ్యక్తులు ఘర్షణపడ్డారన్నారు. దీన్ని గమనించి తమ రెండవ కుమారుడు దాదా ఖలందర్ ఇద్దరికీ నచ్చచెప్పి గొడవ నివారించాడన్నారు. ఇది టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోయారని, సుభాష్‌తో తన కుమారుడు దాదాఖలందర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయించారన్నారు. పోలీసులు విచారణ చేపట్టకుండా ఏకంగా హత్యాయత్నం కేసు నమోదు చేశారన్నారు. రెండు రోజుల క్రితం బెంగళూరులో ఉన్న తన కుమారుడిని అరెస్టు చేసి, తీవ్రంగా కొట్టి.. చిత్రహింసలకు గురి చేశారని ఫొటోలతో సహా చూపించి కన్నీరుమున్నీరయ్యారు. తమ కుటుంబ సభ్యులు కానీ, కుమారుడు దాదాఖలందర్ కానీ తప్పు చేసి ఉంటే ఏ శిక్షకై నా సిద్ధమని చెప్పారు. టీడీపీ నాయకుల నుంచి తమకు ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని ఎస్పీని కోరారు.
అక్రమ కేసుతో కుమారుడిని
జైలుకు పంపారు
తమకు రక్షణ కల్పించాలని కోడిపల్లికి చెందిన కుటుంబం వేడుకోలు