రూటు మార్చిన కేటుగాళ్లు | - | Sakshi
Sakshi News home page

రూటు మార్చిన కేటుగాళ్లు

May 10 2025 2:10 PM | Updated on May 10 2025 2:10 PM

రూటు మార్చిన కేటుగాళ్లు

రూటు మార్చిన కేటుగాళ్లు

నెల 8న తనకల్లు మండలం కొక్కంటి క్రాస్‌లో ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ పేరుతో ఆశాబీ అనే మహిళ హంగామా చేసింది. బేకరీ, హోటల్‌, చికెన్‌ పకోడా దుకాణాల దారుల నుంచి రూ.1,500 చొప్పున వసూలు చేసింది. ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చి ఫుడ్‌ సేఫ్టీ కార్యాలయానికి ఫోన్‌ చేయగా...ఆశాబీ పేరుతో ఎవరూ లేరని చెప్పారు. అప్పటికే ఆమె అక్కడి నుంచి ఉడాయించింది. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రెండు నెలల క్రితం పుట్టపర్తి మున్సిపల్‌ కమిషనర్‌ ప్రహ్లాద పేరుతో ప్రైవేటు క్లినిక్‌ నిర్వహిస్తోన్న డాక్టర్‌కు ఫోన్‌ కాల్‌ వచ్చింది. పన్ను బకాయిలు చాలా ఉందని, ఈ రోజు లోపు ఎంతోకొంత అందజేస్తే.. మాఫీ అయ్యే అవకాశం ఉందని నమ్మబలికి ఫోన్‌ పే నంబరు కూడా చెప్పారు. అయితే డాక్టర్‌ తెలివిగా వ్యవహరించి.. మున్సిపల్‌ అధికారులకు సమాచారం ఇచ్చాడు. తర్వాత ఆ ఫోన్‌ నంబరు స్విచాఫ్‌ వచ్చింది.

రు నెలల క్రితం నల్లమాడ మెయిన్‌ రోడ్డులోని ఓ బేకరీలోకి వెళ్లిన అగంతకుడు.. తాను ఫుడ్‌ సేఫ్టీ అధికారినంటూ హడావుడి చేశాడు. బేకరీపై ఫిర్యాదులు వస్తున్నాయంటూ దబాయించాడు. రూ.10 వేలు ఇస్తే తనిఖీలు చేయకుండా వెళ్తామని చెప్పాడు. వ్యాపారి బతిమాలడంతో రూ.5 వేలు తీసుకుని ఉడాయించాడు. ఆ తర్వాత అతడు నకిలీ అధికారి అని తేలడంతో బేకరీ నిర్వాహకులు లబోదిబోమన్నారు.

సాక్షి, పుట్టపర్తి

ప్రభుత్వ అధికారుల పేరుతో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. మొబైల్‌ కాల్స్‌ ద్వారా నిమిషాల్లో డబ్బులు కొల్లగొడుతున్నారు. తాము మోసపోయామని బాధితులు తెలుసుకునేలోపే అక్కడి నుంచి పరారవుతున్నారు. అనంతరం మొబైల్స్‌ స్విచాఫ్‌ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో జిల్లాలో వరుసగా వెలుగు చూస్తున్నాయి.

పెరిగిన సైబర్‌ నేరాలు

జిల్లాలోని హిందూపురం, పుట్టపర్తి, కొత్తచెరువు, ధర్మవరం, కదిరి తదితర ప్రాంతాల్లో సైబర్‌ మోసాలు పెరిగిపోయాయి. అమాయక ప్రజలను టార్గెట్‌ చేసి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. పల్లె ప్రాంతాల నుంచి పట్టణాల వరకు సైబర్‌ మోసాలు వెలుగు చూస్తున్నాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు సమూహంగా ఏర్పడి.. కొత్త కొత్త మొబైల్‌ నంబర్ల నుంచి కాల్‌ చేసి మాయమాటలు చెప్పి.. నిమిషాల వ్యవధిలో డబ్బులు లాగుతున్నారు. లాటరీ తగిలిందని.. పర్సనల్‌ లోన్‌ అప్రూవల్‌ అయిందని.. ట్యాక్స్‌ ఆన్‌లైన్‌లో కడితే రాయితీ వస్తుందని.. ఇలా పలు రకాలుగా మోసాలకు పాల్పడుతున్నారు.

నకిలీ కార్డులతో గుంపుగా వచ్చి..

రెండు నెలల క్రితం నల్లమాడ, బుక్కపట్నం, ఓడీ చెరువు, కొత్తచెరువు, గోరంట్ల, తనకల్లు తదితర ప్రాంతాల్లో ఫుడ్‌ సేఫ్టీ అధికారుల పేరుతో దుకాణాలు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లలో దుండగులు చొరబడ్డారు. తమ వాహనాలను ప్రభుత్వ స్టిక్కర్లు వేసుకుని.. నకిలీ కార్డులు మెడలో వేసుకుని ఆయా దుకాణదారులను భయపెట్టి భారీగా వసూళ్లు చేశారు. ఓ దుకాణదారుడికి వీరి వ్యవహారంపై అనుమానం రావడంతో అతను ఫుడ్‌ సేఫ్టీలో తమకు తెలిసిన వాళ్లు ఉన్నారని చెప్పాడు. దీంతో ఆగంతకులు తమ బండారం ఎక్కడ బయట పడుతుందోనని భయపడి అక్కడి నుంచి పరారయ్యారు. ఆ తర్వాత వారందరూ నకిలీ అధికారులని తెలిసింది. వెంటనే స్థానిక పోలీస్‌ స్టేషన్‌లలో ఫిర్యాదు చేశారు.

అధికారులపైనే ఆరోపణలు

కొందరు ప్రభుత్వ అధికారులు తమ పరిధిలో అక్కడక్కడా ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని నకిలీ ఐడీ కార్డులు అందజేసి వసూళ్లు చేయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీనిపై కొందరిని ప్రశ్నించగా.. తమకు సంబంధం లేదని దాటవేశారు. నకిలీ అధికారుల ఆచూకీ తెలిపితే.. తాము పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారు. ఫుడ్‌ సేఫ్టీ, తూనికలు, కొలతలు, ఆదాయ పన్ను, కరెంట్‌ బిల్లు వసూలు, బ్యాంకుల్లో పర్సనల్‌ లోన్‌, క్రెడిట్‌ కార్డుల్లో ఆఫర్లు తదితర పేర్లతోనే ఎక్కువగా సైబర్‌ మోసాలు జరుగుతున్నాయి.

అధికారుల పేరుతో డబ్బు వసూలు

జిల్లాలో నకిలీ అధికారుల హల్‌చల్‌

పన్నుల పేరిట ఆన్‌లైన్‌లో దందా

ఫుడ్‌ సేఫ్టీ అధికారుల పేరుతో చిల్లర

రాబడుతున్న వైనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement