
మురళీనాయక్ పోరాటం చిరస్మరణీయం
● కలెక్టరేట్‌లో ఘన నివాళులర్పించిన జిల్లా యంత్రాంగం
ప్రశాంతి నిలయం: భారత్– పాక్ యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ ప్రదర్శించిన ధైర్య సాహసాలు దేశ యువతకు స్ఫూర్తిదాయకమని కలెక్టర్ టీఎస్ చేతన్ కీర్తించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వీరజవాన్ మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చేతన్ మాట్లాడుతూ... పాకిస్తాన్‌తో జరుగుతున్న యుద్ధంలో పాల్గొన్న మురళీనాయక్ శత్రువులను తుదముట్టించి వీరమరణం పొందారన్నారు. ఆయన అత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ పేరు చరిత్ర పుటల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతుందన్నారు. దేశ రక్షణలో ఆయన చూపిన ధైర్యసాహసాలు, పోరాట పటిమకు యూవత్ దేశం గర్విస్తోందన్నారు. అనంతరం మురళీనాయక్ ఆత్మకు శాంతి కోసం కొద్దిసేపు మౌనం పాటించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డీఆర్‌ఓ విజయ సారథి, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
వీరుడికి మరణం లేదు: ఎస్పీ
పుట్టపర్తి టౌన్/గోరంట్ల: వీరుడికి మరణం లేదని, దేశ రక్షణలో అసువులు బాసిన మురళీనాయక్ కూడా అమరుడని ఎస్పీ రత్న కీర్తించారు. దేశ కోసం ప్రాణాలర్పించిన మురళీ నాయక్ యావత్ దేశానికి గర్వకారణమన్నారు. శుక్రవారం ఆమె మండల పరిధిలోని కల్లితండాకు చేరుకొని మురళీనాయక్ తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జోతిబాయిలను పరామర్శించారు. సిబ్బందితో కలిసి మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియల ఏర్పాట్లపై స్థానిక అధికారులతో చర్చించారు.

మురళీనాయక్ పోరాటం చిరస్మరణీయం