
ముగిసిన గ్రూప్–1 మెయిన్స్
● రెండు కేంద్రాల్లో పరీక్ష నిర్వహణ
● 594 మంది అభ్యర్థులకు
381 మంది హాజరు
అనంతపురం అర్బన్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్‌సీ) ఆధ్వర్యంలో ఈ నెల 3న ప్రారంభమైన గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు శుక్రవారంతో ముగిశాయి. ఏడు రోజుల పాటు జరిగిన పరీక్షల్లో అభ్యర్థుల హాజరు 64.28 శాతం నమోదయ్యింది. అనంతపురంలోని పీవీకేకే ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, శ్రీ బాలాజీ పీజీ కళాశాలలో పరీక్షలు నిర్వహించారు. పీవీకేకే కళాశాలలో 234 మంది, శ్రీ బాలాజీ కళాశాలలో 360 మంది..మొత్తం 594 మంది అభ్యర్థులకు గాను 381 మంది హాజరయ్యారు. పరీక్షల తీరును కలెక్టర్ వినోద్‌కుమార్, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్ పరిశీలించారు. పరీక్షలకు లైజన్ అధికారులుగా డిప్యూటీ కలెక్టర్లు తిప్పేనాయక్, మల్లికార్జునుడు వ్యవహరించారు.
‘పరివాహన్’లోనే
ట్రాలీల రిజిస్ట్రేషన్
అనంతపురం సెంట్రల్: ట్రాక్టర్ ట్రాలీల రిజిస్ట్రేషన్లు ఇక నుంచి ‘పరివాహన్’ వైబ్‌సైట్‌లోనే జరుగుతాయని ఉప రవాణా కమిషనర్ (డీటీసీ) ఎం.వీర్రాజు తెలిపారు. ఇప్పటి వరకూ ఈ–ప్రగతి సైట్‌లో రిజిస్ట్రేషన్‌లు జరిగేవని, కొద్దిరోజులుగా ఇందులో రిజిస్ట్రేషన్లు నిలుపుదల చేశామని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో రవాణాశాఖలో ప్రతి సేవా ఆన్‌లైన్‌లోకి వెళ్లిపోయిందన్నారు. ఈ విషయాన్ని ట్రాలీల తయారీ డీలర్లు గమనించి ట్రేడ్ లైసెన్స్ కోసం ఆర్టీఏ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.