
రైతు ప్రాణం బలిగొన్న రెవెన్యూ నిర్లక్ష్యం
తనకల్లు: రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యమే తన తండ్రి ప్రాణాలు బలిగొందంటూ రైతు శంకర్ నాయక్ కుమారుడు రమేష్ నాయక్ ఆరోపించాడు. తన తండ్రి మృతదేహంతో గురువారం ఉదయం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టాడు. తనకల్లు మండలం రామ్లానాయక్‌తండాకు చెందిన శంకర్‌నాయక్ ఐదు రోజుల క్రితం విష ద్రావకం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. అనంతపురంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో గురువారం మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తీసుకుని నేరుగా తనకల్లులోని తహసీల్దార్ కార్యాలయానికి బాధిత కుటుంబసభ్యులు చేరుకుని ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మృతుడి కుమారుడు రమేష్‌నాయక్ మాట్లాడుతూ.. తమకు తండాలో ఐదు ఎకరాల డీకేటీ భూమి ఉందని, అందులో రెండు ఎకరాలను తండ్రి శంకర్‌నాయక్ తన చెల్లెలికి ఇచ్చాడని గుర్తు చేశాడు. ఆ తర్వాత తన నాన్నకు కూడా తెలియకుండా మొత్తం ఐదు ఎకరాలకు మేనత్త, ఆమె భర్త కలిసి పట్టా చేయించుకున్నారని తెలిపాడు. అప్పటి నుంచి తమ భూమి తకు ఇప్పించాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయంలో 21 సార్లు తన నాన్న వినతిపత్రాలను అందజేశారని వివరించాడు. అయినా న్యాయం చేకూరకపోవడంతో ఇక తమకు భూమి దక్కదనే మనస్తాపంతోనే తన తండ్రి ఆత్మహత్యకు పాల్పడినట్లు వాపోయాడు. ఆందోళన కారులతో తహసీల్దార్ శోభాసువర్ణమ్మ మాట్లాడారు. జరిగిన అన్యాయంపై విచారణ చేపట్టి న్యాయం జరిగేలా చూస్తానని భరోసానివ్వడంతో ఆందోళనను విరమించారు.
మృతదేహంతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన