
పకడ్బందీగా ‘గ్రూప్–1 మెయిన్స్’
● జేసీ శివ్ నారాయణ్ శర్మ
అనంతపురం అర్బన్: ఏపీపీఎస్‌సీ ఆధ్వర్యంలో గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ తెలిపారు. అనంతపురంలో పరీక్ష కేంద్రాలను జేసీ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 3న మెయిన్స్ పరీక్షలు ప్రారంభమయ్యాయన్నారు. 9వ తేదీతో ముగుస్తాయన్నారు. కేంద్రాల వద్ద అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించామన్నారు. పరీక్షకు 594 మంది హాజరుకావాల్సి ఉండగా నాల్గో రోజు 381 మంది హాజరయ్యారని, 213 మంది గైర్హాజరయ్యారన్నారు. కార్యక్రమంలో లైజనింగ్ అధికారులు, ఎస్‌డీసీలు మల్లికార్జునుడు, తిప్పేనాయక్ ఉన్నారు.
డిప్యూటీ కలెక్టర్లకు పోస్టింగ్
అనంతపురం అర్బన్: పలువురు డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు మంగళవారం ఉతర్వులు జారీ చేసింది. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న హనుమంతరావు ఆనంద్ పీఏబీఆర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా నియమితులయ్యారు. అహుడా కార్యదర్శిగా ఉన్న డిప్యూటీ కలెక్టర్ జి.గౌరి శంకర్ రావు తిరుపతి జిల్లా సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్‌గా బదిలీ అయ్యారు.
‘హెలికాప్టర్’ ఘటనలో
మరో 9 మంది విచారణ
రామగిరి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి పర్యటన సందర్భంగా హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతిన్న ఘటనకు సంబంధించి మంగళవారం చెన్నేకొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌లో రామగిరి మండల వైఎస్సార్ సీపీ నాయకులను విచారించారు. జెడ్పీటీసీ సభ్యుడు నాగార్జున, నరసింహారెడ్డి, ఆదిరెడ్డి, వెంకటరెడ్డి, జయచంద్రారెడ్డి, ముత్యాలన్న, శ్రీరాముల నాయక్, నారపరెడ్డి, దేవభూషన్‌రెడ్డి తదితరులను సీఐ శ్రీధర్ స్టేషన్‌కు పిలిపించి విచారించారు. ఆ రోజు ఏం జరిగింది...మీరు ఎక్కడున్నారు.. అంటూ ఆరా తీశారు. అనంతరం వారిని సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. కాగా, హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతిన్న ఘటనకు సంబంధించిన కేసులో పోలీసులు 71 మందిని ముద్దాయిలుగా చేర్చగా, ఇప్పటికే 10 మందిని విచారణ చేసి బెయిల్‌పై విడుదల చేశారు. తాజాగా మంగళవారం రామగిరి మండలానికి చెందిన 9 మంది నాయకులను విచారించి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
బాలసదన్‌లోని
ఇద్దరు బాలికలు అదృశ్యం
ధర్మవరం అర్బన్: పట్టణంలోని బాలసదన్‌లో ఉంటున్న ఇద్దరు బాలికలు మంగళవారం అదృశ్యమయ్యారు. వన్ టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ తెలిపిన వివరాల మేరకు... పెనుకొండ మెజిస్ట్రేట్ ఉత్తర్వుల మేరకు తల్లిదండ్రుల సంరక్షణలో లేని ఇద్దరి బాలికలను పట్టణంలోని ఎల్‌పీ సర్కిల్‌లో ఉన్న బాలసదన్‌లో ఉంచి ఆశ్రయం కల్పించారు. మంగళవారం ఉదయం బాలసదన్‌లోని వంట మనిషి, హౌస్ కీపర్ ఇద్దరు కలిసి కూరగాయలు తెచ్చేందుకు బయటకు వెళ్లగా... బాలికలిద్దరూ బాలసదన్ నుంచి బయటకు వెళ్లిపోయారు. అనంతరం బాలసదన్ నిర్వాహకులు వారి కోసం సమీప ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోయింది. అనంతరం బాలసదన్ అకౌంటెంట్ హరిత వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి బాలికల కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు.
శాసనాలను పరిరక్షించాలి
పెనుకొండ: చరిత్రకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన పెనుకొండ కోటలోని శాసనాలను పరిరక్షించాలని చరిత్రకారుడు మైనాస్వామి డిమాండ్ చేశారు. మంగళవారం పెనుకొండలోని పలు శాసనాలను ఆయన పరిశీలించి, మాట్లాడారు. పెనుకొండ కోట నిర్మాణ విశేషాలను తెలుపుతూ ఉత్తర ప్రవేశ కోట ద్వారం లోపల వైపున ఒకటో బుక్కరాయ 1354లో లిఖించిన శాసనం గోడ కదిలిందన్నారు. శాసనం లిఖించిన రాయిలో చీలికలు ఏర్పడ్డాయన్నారు. పెనుకొండ కోట చరిత్రను తెలిపే అత్యంత ముఖ్యమైన శాసనం చెత్త కుప్పలో కలసిపోతోందని, నగర పంచాయతీ సిబ్బంది చొరవ తీసుకుని ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి, కంచె ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే గోరంట్ల ఊరువాకిలి కోట గోడ సైతం లారీ ఢీకొనడంతో దెబ్బతిందన్నారు. శాసనాల పరిరక్షణకు భారత పురావస్తు శాఖ తగిన చర్యలు చేపట్టాలని కోరారు.