
గృహ నిర్మాణాలు వేగవంతం చేయండి
● అధికారులకు కలెక్టర్
టీఎస్ చేతన్ ఆదేశం
ప్రశాంతి నిలయం: గృహ నిర్మాణ ప్రాజెక్టులను వేగవంతం చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో 2019 నుంచి 2024 వరకు మంజూరైన ఇళ్లు.. నిర్మాణాల పురోగతిపై ఆ శాఖ అధికారులతో సమీక్షించారు. అప్షన్ –3 కింద పనుల పురోగతిని ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... జూన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక గృహ ప్రవేశాలు చేయించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఈక్రమంలో జిల్లాలో జూన్ 12 నాటికి 10,368 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలన్నారు. ఇళ్ల నిర్మాణాల పురోగతిపై డివిజన్ స్థాయిలో ఆర్డీఓల ఆధ్వర్యంలో సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, డీఈఈలు సమీక్షా సమావేశాలు నిర్వహించుకోవాలని ఆదేశించారు. కదిరి అర్బన్, ధర్మవరం అర్బన్, లేపాక్షి, రామగిరి, సోమందేపల్లి, హిందూపురం, కొత్తచెరువు తదితర మండలాల్లో ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి కనిపించడం లేదన్నారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అవగాహన కల్పించి ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలన్నారు. సమావేశంలో హౌసింగ్ పీడీ వెంకటనారాయణ, డీఈఈలు శంకర్‌లాల్ నాయక్, శ్రీనివాస్, శివకుమార్ నాయక్, వెంకటరమణారెడ్డి, మండల ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
ఇంటర్ సప్లిమెంటరీకి
పకడ్బందీ ఏర్పాట్లు
ప్రశాంతి నిలయం: ఇంటర్ అడ్వాన్సడ్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని డీఆర్‌ఓ విజయసారథి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ నెల 12వ తేదీ నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమవుతాయని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా తాగునీరు, ఫర్నీచర్, ఫ్యాన్‌లు తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు. నిరంతర విద్యుత్ సౌకర్యం ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం డీఐఈఓ మౌల మాట్లాడుతూ, జిల్లావ్యాప్తంగా ఉదయం 36 సెంటర్లు, మధ్యాహ్నం 22 సెంటర్లలో పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్షల నిర్వహణలో భాగంగా ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షల నిర్వహణ కమిటీ మెంబర్లుగా శ్రీరామరాజు, చెన్నకేశవ ప్రసాద్, శ్రీనివాసులును నియమించామన్నారు. కేంద్రాల్లో తాగునీరు, ఫస్ట్ ఎయిడ్ తదితర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమావేశంలో పుట్టపర్తి డీఎస్పీ విజయ్ కుమార్, విద్యుత్ శాఖ ఎస్‌ఈ సంపత్ కుమార్, కార్మికశాఖ అధికారి సూర్యనారాయణ, విద్యాశాఖ అధికారి లింగన్న, పోస్టల్ శాఖ అధికారి విజయ్, రవాణా శాఖ అధికారి ఇనయతుల్లా తదితరులు పాల్గొన్నారు.

గృహ నిర్మాణాలు వేగవంతం చేయండి