రొద్దం: మండలంలోని తురకలాపట్నం వద్ద ప్రధాన రహదారిపై చింత చెట్టును లారీ ఢీకొంది. వివరాలు.. ఆదివారం ఉదయం పావగడ వైపు నుంచి పెనుకొండకు వెళుతున్న లారీ తురకలాపట్నం వద్దకు చేరుకోగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో గోవిందరెడ్డి ఇంటి వద్ద ఉన్న చింత చెట్టుని బలంగా ఢీకొంది. లారీ క్యాబిన్ నుజ్జునుజ్జయింది. అందులో ప్రయాణిస్తున్న హోంగార్డు బాలరాజుతో పాటు డ్రైవర్ పనసంద్రం నరసింహమూర్తి ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ నరేంద్ర, సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సాయంతో దాదాపు 3 గంటల పాటు శ్రమించి డ్రైవర్, హోంగార్డును వెలికి తీశారు. హోంగార్డుకు చెయ్యి విరిగింది. క్లీనర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్‌కు కాళ్లు విరిగాయి. క్షతగాత్రులను 108 వాహనంలో పెనుకొండలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి రెఫర్ చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
ద్విచక్ర వాహనాలు ఢీ –
వ్యక్తి మృతి
హిందూపురం: ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. సోమందేపల్లి మండలం చెన్నాపురం గ్రామానికి చెందిన భాస్కర్ (35) ఆదివారం రాత్రి ద్విచక్రవాహనంపై వెళుతుండగా హిందూపురం మండలం మణేసముద్రం వద్ద ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన మరో ద్విచక్ర వాహనం ఢీకొంది. ఘటనలో భాస్కర్ అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ద్విచక్ర వాహనంపై ఉన్న ముగ్గురు తీవ్రం గాయపడ్డారు. ఘటనపై హిందూపురం రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కుక్కల దాడిలో గొర్రె పిల్లల మృతి
బుక్కరాయసముద్రం: మండలంలోని అమ్మవారిపేట గ్రామంలో కుక్కల దాడిలో 85 గొర్రె పిల్లలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన గొర్రెల కాపరులు సిద్దప్ప, రామలింగ ఆదివారం అదే గ్రామ శివారులో కంచె ఏర్పాటు చేసి గొర్రె పిల్లలను అందులో ఉంచి పెద్ద గొర్రెలను మేపునకు తీసుకెళ్లారు. ఆ సమయంలో కుక్కలు చొరబడి 85 గొర్రె పిల్లలను కొరికి చంపేశాయి. దీంతో రూ.6 లక్షల వరకూ నష్టం వాటిల్లినట్లు బాధితులు వాపోయారు.

చెట్టును ఢీకొన్న లారీ