
పచ్చ నేత.. భూముల మేత
సాక్షి టాస్క్‌ఫోర్స్: హిందూపురానికి చెందిన టీడీపీ నేత చంద్రమోహన్ యాదవ్ తీరు రోజు రోజుకూ వివాదాస్పదమౌతోంది. రోడ్డుకోసం వదిలిన స్థలంలో ప్రహరీ నిర్మించడంతో పాటు ప్రశ్నించిన అధికారులపై చిందులేశాడు. ప్రహరీ నిర్మాణం అక్రమమని తేల్చినా కోర్టు ఆదేశాలున్నాయంటూ అధికారులనే బెదిరిస్తున్నాడు. ఆఖరుకు ఇంటి సమీపంలోని రోడ్డు స్థలాన్ని కబ్జా చేసేందుకు సిద్ధమయ్యాడు.
రోడ్డు స్థలాన్ని ఆక్రమించి...
మోతుకపల్లిలో ప్రభుత్వం వేసిన లేఅవుట్‌లో పలువురు ఇల్లు నిర్మించుకున్నారు. అందులో టీడీపీ నేత చంద్రమోహన్ యాదవ్ ఇల్లు కూడా ఉంది. అయితే లేఅవుట్‌లో రోడ్డు కోసం వదిలిన స్థలంపై చంద్రమోహన్ కన్నేశాడు. రాష్ట్రంలో కూటమి సర్కార్ కొలువుదీరగానే 10 అడుగుల ఎత్తు గోడ కట్టి ఆ స్థలాన్ని ఆక్రమించుకున్నాడు. దీంతో లేఅవుట్‌లోని వారు నేరుగా పీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేయగా, అక్కడి నుంచి ఫిర్యాదు సీఎంఓకు చేరింది. దీంతో సీఎంఓ అధికారులు నేరుగా బాధితులతో మాట్లాడి విచారణకు ఆదేశించారు. మున్సిపల్ అధికారులు ఆక్రమణ నిజమని తేల్చి ప్రహరీ తీసేయాలని, లేని పక్షంలో తామే తొలగిస్తామని చంద్రమోహన్‌కు నోటీసులు అందించారు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ నెలరోజులు గడిచినా ఎవరూ అటువైపు కన్నెత్తి చూడలేదు. ఇదే విషయంపై గత నెలలో ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీంతో అధికారులు ఆక్రమణను తొలగించడానికి సిద్ధం కాగా, చంద్రమోహన్ వారిపై వాగ్వాదానికి దిగి హంగామా చేశాడు. విషయం ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏల వరకూ వెళ్లడంతో చంద్రమోహన్ కాస్త వెనక్కు తగ్గాడు. అయితే ఆ స్థలం దారి కోసం కాకుండా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసేలా పావులు కదిపాడు. ఇదే విషయాన్ని బాలకృష్ణ పీఏ సురేంద్ర ద్వారా మున్సిపల్ కమిషనర్‌కు చెప్పించారు. అయితే ప్లాంట్ ఏర్పాటు చేసినా మిగిలిన స్థలం చంద్రమోహన్ తన ఆధీనంలోనే ఉంచుకునేందుకు ప్లాన్ వేసుకోవడంతో వివాదం మరింత ముదింది.
హైకోర్టు ఆదేశాలూ బేఖాతరు
టీడీపీ నేత చంద్రమోహన్ గతంలోనే ప్రభుత్వ స్థలంలో కారు పార్కింగ్ కోసం రేకుల షెడ్డు నిర్మించుకున్నాడు. దీంతో గోవిందప్ప అనే వ్యక్తి ఇంటికి ఇబ్బంది కలుగుతుండటంతో బాధితుడు హైకోర్టులో కేసు వేశాడు. దీంతో హైకోర్టు రెండు వారాల గడువులో ఆక్రమణలు తొలగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని 2023లో మున్సిపల్ కమిషనర్‌కు ఆదేశాలిచ్చింది. ఆక్రమణలు నిజమని గుర్తించిన మున్సిపల్ అధికారులు రేకుల షెడ్ తొలగించాలని ఉత్తర్వులు ఇచ్చారు. అయితే టీడీపీ నేత చంద్రమోహన్ కోర్టు ఆదేశాలనూ పట్టించుకోకుండా మున్సిపల్ అధికారులను బెదిరించి పంపించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.
మోతుకపల్లి లేఅవుట్‌లోని
రోడ్డు స్థలం కబ్జా
అధికారులు నోటీసులివ్వడంతో
వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు
ఇప్పటికే ప్రభుత్వ స్థలంలో
కారు పార్కింగ్ కోసం రేకుల షెడ్డు
తొలగించాలని కోర్టు ఆదేశించినా బేఖాతరు
టీడీపీ నేత చంద్రమోహన్ యాదవ్ తీరుపై సర్వత్రా విమర్శలు