
అనంతపురం ఎడ్యుకేషన్: సమగ్ర శిక్ష సహిత విద్య విభాగంలో ఖాళీగా ఉన్న ఐఈఆర్పీ పోస్టుల భర్తీల్లో కొందరు ఫేక్ సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. పరిశీలనలో తేలితే తప్పుకుందాం... లేదంటే ఉద్యోగం వస్తుందనే దురాలోచనతో ఈ అక్రమ మార్గాన్ని ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా స్పెషల్ బీఈడీ, డీఈడీ కోర్సులకు సంబంధించి నకిలీ సర్టిఫికెట్లను జత చేసినట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న సీఆర్పీ పోస్టుల భర్తీకి సంబంధించి గతంలో ఆన్‌లైన్ ద్వారా సమగ్ర శిక్ష ఉన్నత స్థాయి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో ఉమ్మడి అనంత జిల్లా వ్యాప్తంగా 42 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు ప్రక్రియలో కొందరు అక్రమార్కులు నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టానుసారంగా మార్కులు నమోదు చేసి అప్‌లోడ్ చేశారు. స్పెషల్ ఎడ్యుకేషన్‌తో పాటు రిహాబిలిటేషన్ కౌన్సెల్ ఆఫ్ ఇండియా (ఆర్‌సీఐ) నుంచి సర్టిఫికెట్ లైవ్‌లో లేకున్నా పాతవాటితోనే దరఖాస్తు చేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు గతంలో ఐఈఆర్పీగా పని చేయని వారు సైతం ఈ కేటగిరి కింద దరఖాస్తు చేస్తూ సర్వీస్ పాయింట్లను నమోదు చేశారు. రేపటి (మంగళవారం) నుంచి రెండు రోజుల పాటు సమగ్రశిక్ష ఏపీసీ కార్యాలయంలో అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది. ఈ నేపథ్యంలో కొందరు అభ్యర్థులు దరఖాస్తు సమయంలో చేసిన అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. పరిశీలన అధికారులు గుర్తిస్తే ఏదో ఒకటి చెబుదాం, దొరక్కపోతే అలాగే ముందుకు వెళ్దామనే ఆలోచనలో అభ్యర్థులు ఉన్నారు.
ఆన్‌లైన్‌లో ఇష్టానుసారంగా
మార్కుల నమోదు
ఐఈఆర్పీ సర్వీసు లేకపోయినా
ఉన్నట్లుగా చూపిన ఘనులు
ఆర్‌సీఐ గడువు ముగిసిన పత్రాలతోనూ దరఖాస్తు
నకిలీవిగా తేలితే క్రిమినల్ కేసు
నమోదుకు చర్యలు
పరిశీలన పక్కాగా ఉంటుంది
సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ నిపుణుల సమక్షంలో పక్కాగా చేపడుతున్నాం. ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా పరిశీలిస్తారు. అనుమానం వస్తే సంబంఽధిత కళాశాలలు, యూనివర్సిటీలకు లేఖలు రాసి, వాస్తవాలు రాబట్టుకుంటాం. ఇందులో ఫేక్ సర్టిఫికెట్లు జత చేసినట్లు నిగ్గు తేలితే దరఖాస్తు దారుపై క్రిమినల్ కేసు బనాయిస్తాం.
– వి.నాగరాజు, ఏపీసీ సమగ్రశిక్ష