
పుట్టపర్తి టౌన్: ఎవరికేమైతే మాకేంటి.. మా వ్యాపారాలు బాగా జరిగితే చాలు అన్నట్లుగా ఉంది పుట్టపర్తి ఆర్టీసీ బస్టాండ్‌లో దుకాణదారుల తీరు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అమాయక ప్రయాణికుల ప్రాణాల మీదికి తెస్తున్నారు. తగిన చర్యలు తీసుకోవడంలో అధికారులు తాత్సారం ప్రదర్శిస్తున్నారు. దీంతో బస్టాండ్ స్థలం రోజురోజుకు కుంచించుకుపోతోంది. ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు మళ్లిస్తున్న సమయంలో డ్రైవర్లకు అవస్థలు తప్పడం లేదు. పరిసరాలు ఇరుకుగా మారడంతో ఒక్కోసారి బస్సులు అదుపు తప్పుతున్నాయి. అమాయకుల ప్రాణాలు బలిగోరుతున్నాయి. బస్సులు ఢీకొని ఇప్పటికే పలువురు ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. కొందరు గాయపడ్డారు.
పెరిగిన బస్సులు.. ప్రజల రాకపోకలు
సత్యసాయి బాబా ఉన్న కాలంలో ప్రయాణికుల సౌకర్యార్థం పుట్టపర్తి నడిబొడ్డున రెండు ఎకరాల స్థలంలో 1990 అక్టోబర్ 17న బస్టాండ్ ప్రారంభించారు. అన్ని సౌకర్యాలు కల్పించి నూతన హంగులతో తీర్చిదిద్దారు. ఒకప్పటితో పోల్చితే పట్టణానికొచ్చే బస్సుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం బస్టాండ్‌కు నిత్యం 70 దాకా రాకపోకలు సాగిస్తున్నాయి. వేలాది మంది ప్రయాణికులు వచ్చిపోతున్నారు. పుట్టపర్తిని జిల్లాకేంద్రం చేశాక ప్రజల రాకపోకలు భారీగా పెరిగాయి.
అనుమతి మూరెడు.. ఆక్రమణ బారెడు..
ఆర్టీసీ సంస్థకు ఆదాయం పెంపులో భాగంగా బస్టాండ్‌లో 9 దుకాణాలతో పాటు పార్కింగ్ స్థలం ఏర్పాటు చేసి వాటికి టెండర్లు ఖరారు చేసి అనుమతులు మంజూరు చేశారు. దుకాణాల నుంచి నెలకు రూ. 1.20 లక్షల ఆదాయం సమకూరుతోంది. అయితే ప్రతి దుకాణాదారుడు తమ దుకాణం ముందు ఇష్టారాజ్యంగా కుర్చీలు, టేబుళ్లు ఏర్పాటు చేసుకున్నారు. అనుమతులకు మించి స్థలం ఆక్రమించుకున్నారు. పార్కింగ్ స్థలం లీజుదారుడు కొంత వరకూ స్థలం వెనకేసుకున్నారు. దీంతో బస్టాండ్ లోపలకు వస్తున్న సమయంలో బస్సుల డ్రైవర్లు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటిౖకైనా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
పుట్టపర్తి ఆర్టీసీ బస్టాండ్‌లో
దుకాణదారుల ఇష్టారాజ్యం
యథేచ్ఛగా కుర్చీలు, టేబుళ్ల ఏర్పాటు
ఇరుకు కావడంతో బస్సుల
రాకపోకలకు ఇబ్బందులు
చర్యలు తీసుకోవడంలో
అధికారుల నిర్లక్ష్యం
ప్రయాణికుల ప్రాణాలు తీస్తున్న వైనం
చర్యలు తీసుకుంటాం
సంస్థ ఆదాయం పెంపు కోసం కొన్ని దుకాణాలు అద్దెకు ఇచ్చాం. దుకాణదారులు కేటాయించిన స్థలంలోనే ఉండేలా చర్యలు తీసుకుంటాం. వాటి ముందు అనుమతి లేకుండా వేసిన షెడ్లను కూడా గతంలో తొలగించాం. ఇక.. రోజూ సెక్యూరిటీని ఏర్పాటు చేసి ప్రయాణికులపై భద్రతపై దృష్టి సారిస్తాం. ప్రమాదాలు జరగకుండా చూస్తాం.
– మధుసూదన్, డీపీటీఓ
పుట్టపర్తిలోని 5వ వార్డు కుమ్మరపేటకు చెందిన నారాయణమ్మ (65) ఫిబ్రవరిలో ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సు ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. పెనుకొండలో ఉన్న కుమా ర్తెను చూసి తిరిగి స్వస్థలానికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న కుటుంబీకులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు.
బెంగళూరులోని తన కుమార్తె దగ్గరకు వెళ్లేందుకు బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన చిన్న నరసింహప్ప (75) ఇటీవల పుట్టపర్తి ఆర్టీసీ బస్టాండ్‌కు వచ్చారు. అక్కడే బస్టాండ్ పరిసరాల్లోని ఓ దుకాణంలో టీ తాగి, బిస్కెట్ ప్యాకెట్ తీసుకుని మళ్లీ ప్లాట్‌ఫాం వద్దకు వస్తున్నాడు. ఈ క్రమంలోనే పుట్టపర్తి నుంచి హిందూపురం వెళ్తున్న ఓ బస్సు ఆయనను ఢీకొంది. స్థానికులు వెంటనే స్థానిక సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు ధ్రువీకరించారు.

