
పుట్టపర్తి అర్బన్: ‘గడప గడపకూ మన ప్రభుత్వం’లో గుర్తించి మంజూరు చేసిన వాటితో పాటు వివిధ అభివృద్ధి పనుల్లో పురోగతి చూపించాలని అధికారులను కలెక్టర్ బసంత్‌కుమార్ ఆదేశించారు. సోమవారం ఆయన డీఆర్‌ఓ కొండయ్య, ఆర్డీఓ భాగ్యరేఖతో కలిసి కలెక్టరేట్ నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అభివృద్ధి పనుల పురోగతిపై ప్రతి సోమ, మంగళవారాల్లో మండల, డివిజన్ స్థాయిలో సమీక్ష నిర్వహించుకోవాలన్నారు. జిల్లాలో 57 గ్రామ సచివాలయాలు, 50 ఆర్బీకేలు, 42 వైఎస్సార్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణాలు పూర్తయ్యే దశలో ఉన్నాయన్నారు. ఇంకా ప్రారంభం కాని 74 భవనాలకు సంబంధించిన నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. అలాగే ‘గడప గడపకూ మన ప్రభుత్వం’లో మంజూరైన 1,227 పనుల్లో 1,099 పనులు గ్రౌండింగ్ చేశారన్నారు. తక్కిన 128 పనులను వెంటనే గ్రౌండింగ్ చేయాలన్నారు.
ఆధార్ కోసం ప్రత్యేక క్యాంపులు..
ఆధార్ అప్‌డేషన్ 100 శాతం పూర్తి కావాలని కలెక్టర్ ఆదేశించారు. మంగళ, బుధ వారాల్లో జిల్లా వ్యాప్తంగా 75 స్పెషల్ ఆధార్ క్యాంపులు నిర్వహించాలన్నారు. వలంటీర్ల ద్వారా ప్రజలకు తెలియజేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు డిజిటల్ అక్నాలెడ్జ్‌మెంట్ పెండింగ్‌లో ఉందని ముఖ్యంగా హిందూపురం అర్బన్, కదిరి అర్బన్, అమడగూరు అర్బన్, అమడగూరు, గోరంట్ల మండలాలు వెనుకబడి ఉన్నాయన్నారు. సంబంధిత ఎంపీడీఓలు దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో సీపీఓ విజయ్‌కుమార్, హౌసింగ్ పీడీ చంద్రమౌళిరెడ్డి, పీఆర్ ఎస్‌ఈ గోపాల్‌రెడ్డి, డ్వామా పీడీ రామాంజనేయులు, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, డీఎంహెచ్‌ఓ ఎస్‌వీ కృష్ణారెడ్డి, డీఈఓ మీనాక్షి తదితరులు పాల్గొన్నారు.
‘అంగన్‌వాడీ’ నోటిఫికేషన్ సిద్ధం చేయండి
జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో పెనుకొండ సబ్ కలెక్టర్ కార్తీక్, ఐసీడీఎస్ ఆర్‌జేడీ పద్మజతో సమావేశమయ్యారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకుల పోస్టుల నియామకంపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఖాళీగా ఉన్న కార్యకర్తలు, హెల్పర్లు, మినీ వర్కర్లు పోస్టులను గుర్తించి నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. అలాగే సీడీపీఓల మార్పులు, సూపర్‌వైజర్ల పదోన్నతి, కేంద్రాల మార్పు తదితర అంశాలపై సమీక్షించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ లక్ష్మీకుమారి, ఆర్‌డీఓలు భాగ్యరేఖ, రాఘవేంద్ర, తిప్పేనాయక్ తదితరులు పాల్గొన్నారు.
