
వెబ్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ఆర్జేడీ ప్రతాప్‌రెడ్డి
రాప్తాడురూరల్: ఏప్రిల్ 3 నుంచి జరిగే పదో తరగతి పరీక్షల్లో ఎవరైనా ప్రశ్నపత్రాలు లీక్ చేస్తే.. అడ్డంగా దొరికిపోయేలా టెక్నాలజీ రూపొందించామని పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ, ఉమ్మడి అనంతపురం జిల్లా పరీక్షల పరిశీలకుడు బి.ప్రతాప్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన ఉమ్మడి అనంతపురం జిల్లాల డీఈఓలు, డీవైఈఓలు, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్లు, ఎంఈఓలు, సీఎస్, డీఓలతో వెబ్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రశ్నపత్రాలు లీక్ కాకుండా ప్రత్యేక నిఘాతో గట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఒక వేళ పేపర్ లీక్ అయితే అది ఏ విద్యార్థిది, ఏ సెంటర్ నుంచి లీక్ అయిందో నిమిషంలో తెలుసుకునేలా టెక్నాలజీని ఉపయోగిస్తున్నామన్నారు. ఏ ఒక్క విద్యార్థీ నేలపై కూర్చుని పరీక్ష రాయకూడదన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలోనూ ఫర్నీచరు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి సెంటర్‌లోనూ ఇద్దరు మహిళా ఇన్విజిలేటర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అమ్మాయిలను మహిళా టీచర్లు మాత్రమే తనిఖీ చేయాలన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయడానికి మంచి వాతావరణం కల్పించాలని సూచించారు. సీఎస్, డీఓల్లో గతంలో పనిచేసిన వారు ఒక్కరైనా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. లైట్లు, ఫ్యాన్లు, తాగునీరు, మరుగుదొడ్లు తదితర వసతులు ఏర్పాటు చేయాలన్నారు. ఈ నెల 29లోపు అన్ని వసతులూ కల్పించాలని ఆదేశించారు. ప్రైవేట్ స్కూల్లో పరీక్షా కేంద్రం ఉంటే పరీక్షలు జరిగేటప్పుడు ఆ స్కూల్ సిబ్బందిని లోపలికి అనుమతించకూడదన్నారు. సమావేశంలో డీఈఓలు ఎం.సాయిరామ్, మీనాక్షి, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్ పాల్గొన్నారు.
లీక్ చేస్తే అడ్డంగా దొరికిపోతారు..
ఏ ఒక్క విద్యార్థీ నేలపై కూర్చోకూడదు
అన్ని పరీక్షా కేంద్రాల్లోనూ
ఫర్నీచరు ఉండాలి
ఆర్జేడీ, ఉమ్మడి జిల్లా పరీక్షల
పరిశీలకుడు ప్రతాప్‌రెడ్డి