సాయమందించడంలో విఫలం
● తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో
పర్యటించడంలోనూ వైఫల్యమే
● ప్రభుత్వంపై ధ్వజమెత్తిన
కాకాణి గోవర్ధన్‌రెడ్డి
వెంకటాచలం: దిత్వా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, బాధితులకు సాయమందించడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. వెంకటాచలంలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో బుధవారం ఆయన పర్యటించారు. భారీ వర్షాలతో జలమయమైన కాలనీలను సందర్శించి, ప్రజల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. వరదనీటితో మునిగిన కోల్‌కతా – చైన్నె జాతీయ రహదారిని పరిశీలించారు. పలు కాలనీల్లోని ఇళ్లలోకి నీరు చేరడంతో వంట చేసుకోలేక ఇబ్బందులు పడుతున్న వారికి పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భోజన సదుపాయాలను పరిశీలించిన అనంతరం కాకాణి మాట్లాడారు. జిల్లాలో మూడు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నా, ముందస్తు చర్యలు చేపట్టడంలో ప్రభుత్వ యంత్రాంగం, అధికార పార్టీ నేతలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని ధ్వజమెత్తారు. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్ల చుట్టూ నీరు చేరడంతో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొన్నా, అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని చెప్పారు. మంత్రులున్నారో లేరో తెలియక జిల్లా అనాథగా మారిందని మండిపడ్డారు.
అంతా ప్రచారార్భాటమే..
చంద్రబాబుకు ప్రచారార్భాటం తప్ప, ప్రజలకు మేలు చేసే ఆలోచన రాకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలో భారీ వర్షాలొస్తే అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారని గుర్తుచేశారు. సోమిరెడ్డికి అవినీతి సంపాదనే తప్ప, ప్రజల కష్టాలను పట్టించుకునేందుకు సమయం వెచ్చించడంలేదని ఆరోపించారు. జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శిస్తూ.. ఫొటోలకు పోజులిస్తూ.. కాలయాపన చేస్తున్నారే తప్ప, ప్రజల సమస్యలను పరిష్కరించే బాధ్యత తీసుకోవడంలేదని ఎద్దేవా చేశారు. తమ పార్టీ ప్రజాప్రతినిధులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ.. పదవుల నుంచి తొలగిస్తుండటంతో ఆయా గ్రామాల్లో సమస్యలను పట్టించుకునే నాథుడే కరువయ్యారని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీల్లో పేదలకు ఇళ్లు మంజూరు చేసి.. నిర్మిస్తే, వాటికి గృహ ప్రవేశాలను ప్రస్తుత ప్రభుత్వం చేయిస్తూ ప్రచారం చేసుకోవడాన్ని విమర్శించారు. తుఫాన్‌తో ఇబ్బందులు పడుతున్న వారిని ప్రభుత్వం, అధికారులు పట్టించుకోకపోవడంతో.. ఆ బాధ్యతను తమ పార్టీ తీసుకుందని చెప్పారు. ప్రజలకు అవసరమైన ప్రతి చోట వసతి, భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నామని వెల్లడించారు.
పంట పొలాల్లో పరిశీలన
మండలంలోని కసుమూరులో నీటమునిగిన పంట పొలాలను రైతులతో కలిసి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పరిశీలించారు. నారుమడులు పూర్తిగా మునిగిపోయాయని, ఇటీవల వరినాట్లేసిన పొలాల్లోకి నీరు చేరడంతో తాము నష్టపోయామని వాపోయారు. రైతుల సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, యూరియా కోసం అష్టకష్టాలు పడుతున్నా ఏ మాత్రం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. వర్షాలకు దెబ్బతిన్న నారుమడులకు సబ్సిడీపై విత్తనాలను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. నష్టంపై అధికారులు వెంటనే అంచనా వేసి పరిహారాన్ని అందజేయాలని పేర్కొన్నారు. జెడ్పీటీసీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నేతలు మందల పెంచలయ్య, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.


