బిడ్డా.. మాకు దిక్కెవరయ్యా..
● అప్పులిచ్చిన వారి ఒత్తిళ్లు
తట్టుకోలేక యువకుడి ఆత్మహత్య
● గుండెలవిసేలా రోదించిన తల్లి
ఉదయగిరి: బిడ్డా మమ్మల్ని వదిలిపోయావా.. నీతోటి నన్ను, మీ నాయన్నూ తీసుకుపోవచ్చు కదా.. నీవు లేకపోతే మేమెలా బతకాలి కొడుకా.. రాత్రి ఫోన్ చేసి అమ్మా.. అన్నం తిన్నావా.. మందులేసుకున్నావా.. నాన్న ఎలా ఉన్నారు.. అని అడిగి.. రేపు ఇంటికొస్తానని చెప్పి ఇంతలోనే ఎంత పని చేశావయ్యా అంటూ తల్లి రోదిస్తుండటం చూపరులను కలిచేస్తోంది. సీతారామపురం మండలం రంగనాయుడుపల్లికి చెందిన వల్లెపు ప్రతాప్ (28) ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడటంతో మృతుడి తల్లి రోదనలు మిన్నంటాయి. ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాల వద్ద ఆమెను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. రంగనాయుడుపల్లికి చెందిన వల్లెపు పెద్దక్క, వెంకటేశ్వర్లు ఇద్దరు కుమారులు వివాహానంతరం ఉపాధి నిమిత్తం పామూరు, దుత్తలూరులో స్థిరపడ్డారు. బద్వేలులోని అత్తారింటికి కుమార్తె వెళ్లగా, చిన్న కుమారుడు ప్రతాప్ డిగ్రీ వరకు చదువుకొని తల్లిదండ్రుల వద్దే ఉంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామ వలంటీర్‌గా పనిచేసి గుర్తింపును తెచ్చుకున్నారు.
బెట్టింగులకు బానిసై..
అంధుడైన తండ్రికి.. పక్షవాతంతో బాధపడుతున్న తల్లికి ప్రతాప్ ఒక్కరే ఆసరాగా మిగిలారు. వలంటీర్‌గా పనిచేస్తూ.. మరోవైపు గేదెలు మేపుకొంటూ వచ్చే మొత్తంతో తల్లిదండ్రులను చూసుకునేవారు. ఈ తరుణంలో స్నేహితులతో కలిసి ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు గతేడాదిలో బానిసయ్యారు. ఆ విష వలయంలో చిక్కుకొని.. తన వద్ద ఉన్న నగదును పోగొట్టుకొని.. వివిధ అవసరాల నిమిత్తం అంటూ గ్రామస్తుల వద్ద రూ.26 లక్షల వరకు అప్పు చేశారు. సర్వస్వాన్ని బెట్టింగుల్లో పెట్టి నిండా మునిగిపోయారు. దీంతో అప్పిచ్చిన వారు పది నెలలుగా అడుగుతుండటంతో రేపు.. మాపు అంటూ సాగదీశారు. రెండు నెలల నుంచి ఒత్లిళ్లు అధికమవడంతో ఇంటి నుంచి వెళ్లిపోయారు. తల్లితో ఫోన్లో అప్పుడప్పుడూ మాట్లాడుతూ ఆరోగ్యంపై ఆరా తీస్తూ జాగ్రత్తలు చెప్పేవారు. ఈ నేపథ్యంలో దుత్తలూరులోని అన్న ఇంటికి రెండు రోజుల క్రితం వచ్చారు. విషయం తెలుసుకున్న కొంతమంది అక్కడికెళ్లి బాకీ డబ్బులివ్వాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురైన ప్రతాప్.. భోజనం చేసి ఒక గదిలో ఒంటరిగా మంగళవారం రాత్రి నిద్రించారు. తన సోదరుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడాన్ని బుధవారం తెల్లవారుజామున గమనించిన సోదరుడు లబోదిబోమంటూ ఇరుగుపొరుగు వారికి చెప్పారు. మృతదేహాన్ని స్వగ్రామం రంగనాయుడుపల్లికి తీసుకెళ్లారు. వివరాలను స్థానిక పోలీసులు ఆరాతీసి కేసు నమోదు చేశారు. పోస్ట్‌మార్టం నిమిత్తం ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలకు ఎస్సై ఆదిలక్ష్మి తరలించారు. అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఆన్‌లైన్ బెట్టింగుల్లో చిక్కుకొని దుత్తలూరు మండలం కొత్తపేటలో ఓ యువకుడు రూ.17 లక్షలు పోగొట్టుకున్న ఉదంతం మరువకముందే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.


