
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
నెల్లూరు (టౌన్): ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగాయి. ఉదయం జరిగిన ప్రథమ సంవత్సర పరీక్షకు 6,407 మంది విద్యార్థులకు గాను, 6,129 మంది హాజరయ్యారు. 278 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన ద్వితీయ సంవత్సర పరీక్షకు 615 మంది విద్యార్థులకు 572 మంది హాజరు కాగా, 43 మంది గైర్హాజరయ్యారు. ఆర్‌ఐఓ వరప్రసాద్‌రావు, ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ అధికారులు మొత్తం 27 కేంద్రాల్లో తనిఖీ చేశారు. ఎండ తీవ్రతతో విద్యార్థులతో వచ్చిన తల్లిదండ్రులు బయట పడిగాపులు కాశారు. ఎండ తీవ్రతకు ఇబ్బందులు పడ్డారు.
అనారోగ్యంతో ఖైదీ మృతి
వెంకటాచలం: చెముడుగుంట సమీపంలో ఉన్న జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న షేక్ అబ్దుల్లా (41) సోమవారం అనారోగ్యంతో మృతి చెందాడు. పోలీసుల సమాచారం మేరకు ఎన్‌టీఆర్ జిల్లా మాచవరం ప్రాంతానికి చెందిన షేక్ అబ్దుల్లా సూర్యాపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన ఓ కేసులో 2024 ఏప్రిల్ 28 తేదీ నుంచి జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. సోమవారం ఉదయం 5.55 గంటల సమయంలో స్పృహ కోల్పోయి పడిపోవడంతో వెంటనే జైలు సిబ్బంది చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. జైలు సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
సముద్రంలోకి
తాబేళ్ల విడుదల
నెల్లూరు(అర్బన్): జిల్లా అటవీ శాఖాధికారి కె.మహబూబ్‌బాషా సారథ్యంలో సోమవారం పలుచోట్ల పెద్ద సంఖ్యలో ఆలివ్‌రిడ్లీ తాబేళ్ల పిల్లలను సముద్రంలోకి విడుదల చేశారు. డీఎఫ్‌ఓ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో తాబేళ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. మత్స్య సంపద పెరగడంలో వాటి పాత్ర ఎంతో ఉందన్నారు. మైపాడు, ఎర్రన్నదిబ్బ, ఊటుకూరు, రామచంద్రాపురం, కొత్తూరు, పాతపాళెం, లక్ష్మీపురం, ఒట్టూరు, కర్లపాళెం, తాటిచెట్లపాళెం తదితర 10 ప్రాంతాల్లో హేచరీల నుంచి సముద్రంలోకి తాబేళ్లను విడుదల చేశామన్నారు. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు మొత్తం 24,481 తాబేళ్ల పిల్లలను వదిలినట్లు తెలిపారు. తాబేళ్లకు హాని కలుగకుండా జాలర్లు సముద్రంలో వేట సాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో కావలి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, సముద్ర తాబేళ్ల పరిరక్షణ కమిటీ మెంబర్లు పాల్గొన్నారు.
వీఆర్‌కు కొండాపురం ఎస్సై
కొండాపురం: కొండాపురం ఎస్సై వెంకట్రావును వీఆర్‌కు బదిలీ చేస్తూ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. కావలికి చెందిన ఓ మహిళతో ఎస్సై అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆమె కావలి ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో ఆదివారం రాత్రి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతో ఎస్సైను వీఆర్‌కు బదిలీ చేసినట్లు సమాచారం. ఈ విషయంపై కలిగిరి సీఐ వెంకటనారాయణను సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.
జెన్‌కో కార్మికుల
అర్ధనగ్న ప్రదర్శన
ముత్తుకూరు (పొదలకూరు): ముత్తుకూరు మండలంలోని నేలటూరు జెన్‌కోలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులు తమను కాంట్రాక్ట్ కార్మికులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ సోమవారం అర్ధనగ్న ప్రదర్శన చేశారు. జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు మాట్లాడుతూ నెల రోజులుగా నిరసనలు చేపట్టుతున్నా.. యాజమాన్యంలో చలనం లేదన్నారు. జెన్‌కోలో 1,500 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారని, మరో 500 మంది అవుట్ సోర్సింగ్ కార్మికులు ఉన్నారని తెలిపారు. అవుట్ సోర్సింగ్ కార్మికులు ఏహెచ్‌పీ (యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్), సీహెచ్‌పీ (కోల్ హ్యాడ్లింగ్ ప్లాంట్), ఈఓసీఎస్ (కన్వేయర్ బెల్ట్)ల్లో అతిప్రమాదకరమైన ప్రాంతంలో పనిచేస్తున్నారన్నారు. కాంట్రాక్టర్లుగా ఉన్న వారు అవుట్ సోర్సింగ్ కార్మికుల వద్ద పది మంది పనిని ఒకరితో చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ భద్రత, ప్రాణాలకు భద్రత లేనందున తమను కాంట్రాక్ట్ కార్మికులుగా గుర్తిస్తే చట్టపరమైన హక్కులు లభిస్తాయని చెప్పారు. ఈ ఆందోళనలో జేఏసీ కన్వీనర్ గోడ భాస్కర్, నాయకులు శేఖర్, ఆదిశేషయ్య, శ్యాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు