
ఈతకెళ్లి అన్నదమ్ములు గల్లంతు
సంగం: వేసవి సెలవులను అమ్మమ్మ ఇంట్లో ఆనందంగా గడుపుదామని వచ్చిన ఆ చిన్నారులు కనిగిరి రిజర్వాయర్ పెద్ద కాలువలో సోమవారం గల్లంతయ్యా రు. కాలువలో మూడు రోజులుగా కొద్దిపాటి నీళ్లు ఉండడంతో చిన్నారులు అందులో ఈతాడుతున్నారు. సోమవారం ఇరిగేషన్ అధికారులు ఆ కాలువకు నీటి ప్రవాహం పెంచడంతో ఆ చిన్నారులు రోజులాగే ఉంటుందని భావించి ఈతాడేందుకు వెళ్లి ఆ ఉధృతికి గల్లంతయ్యారు. రాత్రి వరకు పోలీసులు, స్థానికులు, కుటుంబ సభ్యులు గాలించినా జాడ కనిపించలేదు.
సంగంకు చెందిన దండె వెంకటరమణమ్మకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె శేషమ్మ, బందా గోవిందయ్య దంపతులు కోవూరు మండలం చిన్నపడుగుపాడు స్టౌబీడీ కాలనీలో నివాసముంటున్నారు. ఆ దంపతులకు వెంకట చందు (15), వెంకట నందకిశోర్ (13) సంతానం. తల్లిదండ్రులిద్దరూ బేల్దారి పనులకు వెళ్లి కుమారులను చదివించుకుంటున్నారు. పెద్ద కుమారుడు 9వ తరగతి పూర్తి చేసుకుని 10వ తరగతికి, వెంకట నందకిశోర్ 7వ తరగతి పూర్తి చేసుకుని 8వ తరగతికి వచ్చారు. వేసవి సెలవులు కావడంతో 10 రోజుల క్రితం సంగంలోని అమ్మమ్మ వెంకటరమణమ్మ ఇంటికి వచ్చారు. మూడు రోజులుగా స్థానిక చిన్నారులతో కలిసి గ్రామానికి కొద్ది దూరంలో ఉన్న కనిగిరి రిజర్వాయర్ పెద్ద కాలువ వద్దకు వెళ్లి కొద్దిపాటి నీళ్లలో ఈతాడుతున్నారు. అయితే ఇరిగేషన్ అధికారులు సోమవారం కనిగిరి రిజర్వాయర్‌కు సాగునీటిని ఉదయం నుంచి సాయంత్రం వరకు 500 నుంచి 1500 క్యూసెక్కులకు పెంచారు. ఈ విషయం తెలియని చిన్నారులు రోజు మాదిరిగానే కాలువలోకి దిగి ఈతాడేందుకు వెళ్లారు. సాయంత్రం 3 గంటల సమయంలో ఈతకు దిగిన చిన్నారులు గల్లంతయ్యారు. 5 గంటల వరకు కూడా వారి ఆచూకీ తెలియకపోవడంతో కాలువ గట్టు న దుస్తులు ఉండడంతో స్థానికులు పోలీసులకు, కుటుంబ సభ్యులకు తెలిపారు. ఎస్సై రాజేష్, పోలీసు సిబ్బంది స్థానికులతో కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి ఇరిగేషన్ అధికారులు సాగునీటి విడుదలను నిలిపివేయడంతో సీఐ వేమారెడ్డి, ఎస్సై రాజేష్ గజ ఈతగాడు వెంకటేశ్వర్లు, స్థానిక యువకులతో కలిసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రాత్రి పొద్దుపోయే వరకు కూడా ఆ చిన్నారుల ఆచూకీ లభ్యం కాలేదు. చిన్నారులు ఈతకు వెళ్లి గల్లంతు కావడంతో వెంకటరమణమ్మతోపాటు, తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఇద్దరు బిడ్డల ఆచూకీ తెలియకపోవడంతో వారిని ఓదార్చడం ఎవరికి సాధ్యపడడం లేదు. దీంతో సంగం, కోవూరు స్టౌబీడీ కాలనీల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
వేసవి సెలవులకు
అమ్మమ్మ ఊరు వచ్చిన చిన్నారులు
పెద్దకాలువ వద్ద ఘటన
గాలిస్తున్న పోలీసులు, స్థానికులు
రాత్రి వరకు జాడ తెలియని పరిస్థితి

ఈతకెళ్లి అన్నదమ్ములు గల్లంతు

ఈతకెళ్లి అన్నదమ్ములు గల్లంతు

ఈతకెళ్లి అన్నదమ్ములు గల్లంతు