కన్నీళ్లతో సమస్యల్ని విన్నవించి.. | - | Sakshi
Sakshi News home page

కన్నీళ్లతో సమస్యల్ని విన్నవించి..

May 12 2025 11:50 PM | Updated on May 12 2025 11:50 PM

కన్నీళ్లతో సమస్యల్ని విన్నవించి..

కన్నీళ్లతో సమస్యల్ని విన్నవించి..

నెల్లూరు(క్రైమ్‌): ‘న్యాయం కోసం పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నా కనికరించడం లేదు. మీరైనా విచారించి న్యాయం చేయండి’ అంటూ పలువురు బాధితులు ఏఎస్పీ సీహెచ్‌ సౌజన్యను కోరారు. సోమవారం నెల్లూరు నగరంలోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్‌ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి 79 మంది విచ్చేసి ఏఎస్పీ, డీఎస్పీ చెంచురామారావును కలిసి వినతులు అందజేశారు. చట్టపరిధిలో విచారణ జరిపి న్యాయం చేస్తామని సౌజన్య హామీ ఇచ్చారు. కార్యక్రమంలో లీగల్‌ అడ్వైజర్‌ శ్రీనివాసులురెడ్డి, ఎస్‌బీ–2 ఇన్‌స్పెక్టర్‌ బి.శ్రీనివాసరెడ్డి, ఫిర్యాదుల విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఫిర్యాదు చేసినా..

నా ఇంటి పక్కనున్న ఖాళీ స్థలంలో చెత్త వేశానన్న కోపంతో మహిళా కానిస్టేబుల్‌ స్వప్న, ఆమె భర్త నాపై దాడి చేయడంతో ఎడమ చేయి, కాలు విరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. గత నెల 21వ తేదీన సమస్యను ఎస్పీ దృష్టికి తీసుకెళ్లగా తగిన చర్యలు తీసుకోవాలని కలువాయి పోలీసులను ఆదేశించారు. అయినా వారు పట్టించుకోలేదు. న్యాయం చేయాలని కలువాయి మండలానికి చెందిన వృద్ధురాలు రాజమ్మ కోరారు.

ట్రేడింగ్‌ పేరిట

రూ.10.30 లక్షలు దోచేశారు

నాకు ఫేస్‌బుక్‌లో లిఖిత అనే మహిళ పరిచయమైంది. ఫోరెక్స్‌ ట్రేడింగ్‌ కంపెనీలో డబ్బులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించింది. రూ.10.30 లక్షలు పెట్టించింది. నా ఖాతాలో పెద్ద మొత్తంలో డబ్బులు చూపించింది. వాటిని విత్‌డ్రా చేసేందుకు యత్నించగా కాలేదు. కస్టమర్‌ కేర్‌ సిబ్బందిని సంప్రదించగా కొంత మొత్తంలో పన్ను కడితే మొత్తం డబ్బులు విత్‌డ్రా చేయొచ్చని చెప్పారు. సదరు మహిళక పథకం ప్రకారమే నన్ను మోసగించిందని నెల్లూరుకు చెందిన ఓ యువకుడు అర్జీ ఇచ్చాడు.

ఉద్యోగం పేరిట మోసం

బుచ్చిరెడ్డిపాళెం ప్రాంతానికి చెందిన రఫీ అతడి కుటుంబ సభ్యులు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి పలు దఫాలుగా నా వద్ద రూ.6 లక్షలు తీసుకున్నారు. నెలలు గడుస్తున్నా ఉద్యోగం ఇప్పించలేదు. దీంతో వారిని నా డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా దౌర్జన్యం చేస్తున్నారు. చర్యలు తీసుకోవాలని సంగంకు చెందిన ఓ వ్యక్తి కోరాడు.

చంపుతామని బెదిరిస్తున్నారు

నా భర్త మరణించాడు. ఆయన అన్న కుమారుడు రఫీ నేను ఉంటున్న ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోవాలని లేనిపక్షంలో చంపుతామని బెదిరిస్తున్నాడు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశా. వారు పట్టించుకోలేదని ఆత్మకూరుకు చెందిన ఓ మహిళ అర్జీ ఇచ్చారు.

వేధిస్తున్నాడు

మనవడైన రమేష్‌ నా ఆస్తిని తీసుకున్నాడు. ఇప్పుడు నా బాగోగులు పట్టించుకోవడం లేదు. వివిధ రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు. విచారించి చర్యలు తీసుకోవాలని బుచ్చికి చెందిన ఓ వృద్ధురాలు కోరారు.

మేనమామపై చర్యలు తీసుకోవాలి

ఆస్తి విషయంలో నా మేనమామ శివకుమార్‌ ఇబ్బంది పెడుతున్నాడు. అసభ్యంగా, దురుసుగా ప్రవర్తిస్తున్నాడని నెల్లూరు రూరల్‌ పరిధికి చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు.

ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్‌ హాల్లో

‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’

అర్జీలిచ్చిన 79 మంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement