
మీటర్ రీడింగ్ తీస్తున్న సిబ్బంది
కూటమి ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న వారికి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. అనేకమంది భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇరవై ఏళ్లుగా విద్యుత్ శాఖలో మీటర్ రీడర్లుగా పనిచేస్తున్న వారికి కమీషన్‌ను కాంట్రాక్టర్ తగ్గించారు. చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజలపై విద్యుత్ చార్జీల భారం మోపారు. ఇప్పుడు మీటర్ రీడర్ల జీవితాలకు ఇబ్బంది ఏర్పడింది.
దుత్తలూరు: మీటర్ రీడర్లు.. ఎండ, వానను లెక్క చేయకుండా ప్రతి నెలా తొలివారంలోనే ఇంటింటికీ వెళ్లి విద్యుత్ బిల్లులు తీస్తుంటారు. వీరికి ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో సమస్యలు ఎదురవుతున్నాయి. గత ప్రభుత్వం ఇచ్చిన వేతనం కంటే తగ్గించి ఇస్తున్నారు. దీనిపై ప్రశ్నిస్తే సంబంధిత కాంట్రాక్టర్ బెదిరింపులకు దిగుతున్నట్లు సమాచారం. అంతేకాక స్మార్ట్ మీటర్ల రాకతో జిల్లాలో సుమారు 300 కుటుంబాలు వీధిన పడనున్నాయి.
అన్ని రంగాల్లో..
కూటమి ప్రభుత్వం ప్రతి రంగంలో చిరుద్యోగులపై ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే వలంటీర్లు, మద్యం షాపులో పనిచేసే ఉద్యోగులు, ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు, మధ్యాహ్న భోజన కార్మికులు.. ఇలా అనేకమందిని తొలగించారు. ఇప్పుడు విద్యుత్ మీటర్ల బిల్లులు తీసే రీడర్లపై సర్కారు గురిపెట్టింది. దీంతో వారు లబోదిబోమంటున్నారు. జిల్లాలో విద్యుత్ శాఖలో 300 మందికి పైగా మీటర్ రీడర్లు పనిచేస్తున్నారు. గతంలో ఒక్కో బిల్లుకు నగరాల్లో రూ.3.60, గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.3.73 చొప్పున చెల్లించేవారు. సంబంధిత కాంట్రాక్టర్లు రీడర్లకు ఈపీఎస్, ఈఎస్‌ఐ పోను మిగిలినవి అందజేసేవారు. అంతేకాక అప్పుడు డివిజన్ వారీగా కాంట్రాక్టర్లు ఉండేవారు. గత ప్రభుత్వం రీడర్లకు నేరుగా వారి బ్యాంక్ ఖాతాకే వేతనాలు జమచేయాలని విద్యుత్ యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో సిబ్బంది ఎలాంటి కోతలు లేకుండా నెలవారీ వేతనం అందుకునే వారు.
నేడిలా..
కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఉన్న కాంట్రాక్టర్లను తొలగించింది. తమ పార్టీకి అనుకూలమైన వారికి జిల్లా మొత్తం బాధ్యతను అప్పగించింది. సదరు కాంట్రాక్టర్ ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో మీటరుకు రూ.3.15, గ్రామీణ ప్రాంతాల్లో రూ.3.45 వంతున ఇస్తానని, ఇష్టం ఉన్నవాళ్లు ఉండాలని చెబుతున్నట్లు రీడర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కమీషన్ తగ్గించడంతో సుమారు రూ.3 వేల నుంచి రూ.4 వేలు జీతం తగ్గిపోతుందని, దీంతో తమ కుటుంబాన్ని పోషించుకోవడం ఇబ్బందికరంగా మారుతుందని చెబుతున్నారు. అంతేకాక మీటర్ల బిల్లులు 1 నుంచి 7వ తేదీ లోపలే పూర్తి చేయాలని ఆదేశించడంతో ఒత్తిడికి లోనవుతున్నారు.
జిల్లాలో విద్యుత్ కనెక్షన్ల వివరాలు
కేటగిరీ – 1 9,42,905
కేటగిరీ – 2 1,07,800
కేటగిరీ – 3 4,172
కేటగిరీ – 4 26,436
వ్యవసాయ
సర్వీసులు : 2,00,448