
అవగాహన కల్పిస్తున్న ప్రిన్సిపల్ రమేష్
ఇందుకూరుపేట: పిల్లల్లో కౌమార దశ చాలా కీలకమైందని డైట్ ప్రిన్సిపల్ పీ రమేష్ అన్నారు. పల్లిపాడులోని డైట్ కళాశాలలో ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు కౌమార విద్యపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌమార దశ 10–19 ఏళ్లలోపు ఉంటుందని తెలిపారు. ఈ దశలో పిల్లల్లో శారీరకంగా, మానసికంగా మార్పులు చోటు చేసుకుంటాయని వివరించారు. జగదేవిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి కిషోర్‌కుమార్ మాట్లాడుతూ కౌమార దశలో పిల్లల వచ్చే శారీరక మార్పులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో డైట్ కళాశాల అధ్యాపకులు, వైద్యారోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో
వ్యక్తికి గాయాలు
వెంకటాచలం: మోటార్ బైక్ అదుపుతప్పడంతో ఓ వ్యక్తి గాయపడిన ఘటన మండలంలోని సర్వేపల్లి సమీపంలో శనివారం చోటు చేసుకుంది. వివరాలు..గూడూరుకు చెందిన శ్రీనివాసులు పని నిమిత్తం మోటార్‌బైక్‌పై ముత్తుకూరు మండలం పంటపాళేనికి వచ్చాడు. తిరిగి గూడూరుకు వెళ్తున్న క్రమంలో సర్వేపల్లి సమీపంలో కృష్ణపట్నం రోడ్డుపై మోటార్ బైక్ అదుపు తప్పడంతో శ్రీనివాసులు గాయపడ్డాడు. క్షతగాత్రుడ్ని చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఏపీపీఎస్సీ పరీక్షలకు
ఉచిత శిక్షణ
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఏపీపీఎస్సీ గ్రూప్–2 ప్రిలిమినరీ పరీక్షలకు హాజరయ్యే బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా బీసీ స్టడీ సర్కిల్ సంచాలకులు వెంకటయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27 నుంచి 60 రోజుల పాటు 60 మంది అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వడంతో పాటు స్టైఫండ్, స్టడీ మెటీరియల్ అందజేయనున్నట్లు తెలిపారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన అర్హులైన అభ్యర్థులు ఈ నెల 22లోగా నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శోధననగర్‌లో ఉన్న బీసీసీ స్టడీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 93815 54779, 93902 39588 నంబర్లలో సంప్రదించాలని కోరారు.