
నెల్లూరు(టౌన్): సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీజనల్ హాస్టళ్లలో జరుగుతున్న అవకతవకలపై సమగ్రశిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు సీరియస్ అయ్యారు. సీజనల్ హాస్టళ్లలోని అవకతవకలపై ‘సాక్షి’లో ‘సమగ్రలో పర్యవేక్షణ కరువు’ శీర్షికన బుధవారం కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ కథనంపై స్పందించిన స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ విచారణకు ఆదేశించా రు. నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి సీజనల్ హాస్టళ్లలో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టి నివేదిక అందజేయాలని ఆదేశించారు. సీజనల్ హాస్టళ్లతో పాటు నాన్ రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్లను తనిఖీ చేయాలని సూచించారు. జిల్లాలో మొత్తం 23 సీజనల్ హాస్టళ్లు, 32 నాన్ రెసిడెన్సియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయి. సీజనల్ హాస్టళ్ల అవకతవకలపై విచారణ కమిటీలో సీమ్యాట్ అసోసియేట్ ఫెలో శారదాకుమారి, అసెస్‌మెంట్ సెల్ ప్రొఫెసర్ అపర్ణ, కేజీబీవీ అసిస్టెంట్ డీసీడీఓ ఉష, ఎడ్యుకేషన్ స్టేట్ కోఆర్డినేటర్ భారతిని నియమించారు. ఈ కమిటీ సీజనల్ హాస్టళ్లపై లోతైన విచారణ చేపట్టి అవకతవకలను వెలికితీస్తారా లేక ప్రలోభాలకు లొంగి మిన్నకుంటారా అనేది వేచి చూడాల్సి ఉంది.
‘సాక్షి’ కథనంపై
సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ సీరియస్
విచారణకు నలుగురితో
కూడిన కమిటీ ఏర్పాటు