
నెల్లూరు(దర్గామిట్ట): మండల కేంద్రాల్లో నిర్వహిస్తున్న జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని జాయింట్ కలెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. నెల్లూరులోని తన కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కలెక్టర్ అధ్యక్షతన అన్ని శాఖల జిల్లాస్థాయి అధికారులతో కలిసి నిర్వహిస్తున్న జగనన్నకు చెబుదాంలో రెవెన్యూ సమస్యలే కాకుండా పలు అభివృద్ధి పనులకు సంబంధించి ప్రజల నుంచి అర్జీలు వస్తున్నాయన్నారు. వాటిని సంబంధిత అధికారులకు అందజేస్తున్నట్లు వెల్లడించారు. ఆత్మకూరు, దగదర్తి, రాపూరు, ఇందుకూరుపేట మండల కేంద్రాల్లో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. జిల్లాలో ఈనాం భూములను 186 గ్రామాల్లో గుర్తించామన్నారు. వాటికి సంబంధించి నివేదిక సిద్ధం చేస్తున్నామన్నారు. 577 గ్రామాల్లో పేదల అసైన్‌మెంట్ భూములను గుర్తించామని, ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఈనాం, అసైన్‌మెంట్ భూములపై పేదలకు సర్వ హక్కులు కల్పించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమన్నారు.
ఆంక్షలు లేవు
ధాన్యం అమ్మకాలపై రైతులకు ఎటువంటి ఆంక్షలు లేవని జేసీ తెలిపారు. రైతులు ఎక్కడైనా అమ్ముకోవచ్చన్నారు. వ్యాపారులు, మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయొచ్చని స్పష్టం చేశారు. జిల్లాలో ప్రస్తుతం ఎడగారు సీజన్‌కు సంబంధించి 1.5 లక్షల ఎకరాల్లో సాగు చేశారని, సుమారు 5 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. కేఎన్‌యూ 1638, కేఎన్‌యూ 733, బీపీటీ, ఏటీయూ 1010, ఎన్‌ఎల్‌ఆర్ 34449 రకాల ధాన్యాన్ని సాగు చేసినట్లు చెప్పారు. ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ఏ గ్రేడ్ రకం పుట్టి రూ.17,500, సాధారణ రకం రూ.17,034కు కొనుగోలు చేయాలన్నారు. రైతులకు ప్రభుత్వం నిర్దేశించిన ధర కల్పించేందుకు అవసరమైన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఏటీయూ 1010 మినహా అన్ని రకాల ధాన్యాలను ఆయా కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తారన్నారు. కొడవలూరు, విడవలూరు, కలువాయి, అనంతసాగరం తదితర ప్రాంతాల్లో కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ధాన్యం కొనుగోలుకు సిద్ధం
జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్