
పోటీలో తలపడుతున్న ఎడ్లు
కోవూరు : శ్రీరామనవమి సందర్భంగా మండలంలోని నేతాజీనగర్‌లో గురువారం ఎడ్ల పందేలు హోరాహోరీగా జరిగాయి. జిల్లా నలుమూలల నుంచి మొత్తం 30 జతల ఎడ్లు పాల్గొనగా, డీఏఏబీ చైర్మన్ నిరంజన్‌బాబురెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు శ్రీలత, ఎంపీపీ పార్వతి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ క్రీడగా కొనసాగుతున్న ఎడ్ల పందేలను జిల్లాలోని అనేక ప్రాంతాల్లో జరుగుతున్నట్లు తెలిపారు. హోరాహోరీగా జరిగిన పోటీల్లో మినగల్లు ఎడ్లు విజేతగా నిలిచాయి. తర్వాతి స్థానాల్లో కోవూరు, గంగపట్నం ఎడ్లు నిలిచాయి. పోటీలు నిర్వహించే సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రాధాకృష్ణారెడ్డి, పడుగుపాడు సర్పంచ్ లక్ష్మీనారాయణ, ఉప సర్పంచ్ అహ్మద్, ఎంపీటీసీ సభ్యురాలు బాబురావు, సచివాలయాల మండల కన్వీనర్ కవరగిరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.