
మాట్లాడుతున్న అతిథులు
● కలెక్టర్ చక్రధర్‌బాబు
నెల్లూరు(అర్బన్) : సమాజంలో వైద్య వృత్తికి ప్రత్యేక గౌరవం ఉందని, కొత్తగా డాక్టర్ వృత్తిలోకి వస్తున్న వారు రోగులను ప్రేమగా ఆదరించి వైద్యం అందించాలని కలెక్టర్ చక్రధర్‌బాబు సూచించారు. నగరంలోని దర్గామిట్ట వద్ద ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాలలో వైద్య విద్యను పూర్తి చేసుకున్న డాక్టర్లకు కాన్వొకేషన్ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం రాత్రి కలెక్టర్ హాజరై, మాట్లాడారు. పవిత్ర వైద్య వృత్తిలో పేద రోగులను ఆదుకోవడం, వారికి నాణ్యమైన వైద్యం అందించడం డాక్టర్ల బాధ్యత అని తెలియజేశారు. అనంతరం పలువురికి డాక్టర్ పట్టాలను కలెక్టర్ చేతుల మీదుగా అందించారు. 75 మంది విద్యార్థులు కాన్వొకేషన్‌లు పొందారు. అనంతరం వైద్య విద్యార్థులు తమ ఆట, పాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ మురళీకృష్ణ, పెద్దాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సిద్దా నాయక్, ఏడీ ఏడుకొండలు, డాక్టర్లు మస్తాన్‌బాషా, కాళేషా, కళారాణి, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

కాన్వొకేషన్ అందుకుంటున్న విద్యార్థిని