బ్యాటరీల చోరీ ముఠా అరెస్ట్‌

- - Sakshi

రూ.7.40 లక్షల విలువైన బ్యాటరీల స్వాధీనం

కావలిరూరల్‌: జిల్లాలో సెల్‌ఫోన్‌ టవర్ల వద్ద బ్యాటరీలు చోరీ చేస్తున్న ముఠాను మంగళవారం అరెస్ట్‌ చేసినట్లు కావలి డీఎస్పీ ఎం.వెంకటరమణ తెలిపారు. పట్టణంలోని రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. కావలి రూరల్‌, బిట్రగుంట, ఎస్‌ఆర్‌పురం, దగదర్తి, కోవూరు, కొడవలూరు, జలదంకి పోలీస్‌స్టేషన్ల పరిధిలో సెల్‌ఫోన్‌ టవర్లలో ఉన్న బ్యాటరీలను కావలి పట్టణం ఇందిరమ్మ కాలనీ, ముసునూరులకు చెందిన దార్ల తిరుపతి, దార్ల శ్రీను, దార్ల శ్రీను(మొల్లోడు), పర్తాపు కల్యాణం, దార్ల చిన్న రాత్రి వేళ్లలో ఆటోలో తిరుగుతూ సెల్‌టవర్ల వద్ద తాళాలు పగులగొట్టి బ్యాటరీలు చోరీ చేసేవారు. ఎస్పీ ఆదేశాల మేరకు కావలిరూరల్‌ సీఐ ఎం.రాజేష్‌, ఎస్సై వెంకటరావు సిబ్బందితో కలిసి మంగళవారం ముసునూరు పమిడి కళాశాల వద్ద జాతీయ రహదారిపై నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని తెలిపారు. నిందితులను విచారించి వారి వద్ద నుంచి రూ.7.40 లక్షల విలువైన 100 బ్యాటరీలు, ఆటో, బైక్‌, టూల్‌కిట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

బైక్‌ను బస్సు ఢీకొని వ్యక్తి దుర్మరణం

కావలి రూరల్‌: ఆర్టీసీ హైర్‌ బస్సు ఢీకొని మనుబోలు సుబ్బారాయుడు(34) అనే వ్యక్తి మృతిచెందిన ఘటన మంగళవారం స్థానిక ఆర్టీసీ గ్యారేజ్‌ వద్ద చోటుచేసుకుంది. ఒకటో పట్టణ ఎస్సై పి.జమాల్‌వలి తెలిపిన వివరాల మేరకు పట్టణంలోని శ్రీపొట్టిశ్రీరాములు వీధికి చెందిన మనుబోలు సుబ్బరాయుడు నెల్లూరులో ఒక ప్రైవేట్‌ పాఠశాలలో ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహిస్తుండేవాడు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు సో మవారం కావలికి వచ్చాడు. తన సమీప బంధువు అయిన కంటా సుభాషిణి ఆర్టీసీలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తుండడంలో ఆమెను ద్విచక్రవాహనంపై స్థానిక ఆర్టీసీ గ్యారేజ్‌లో వదిలి వస్తుండగా హైర్‌ బస్సు అతివేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో సుబ్బరాయుడు అక్కడికక్కడే మృతిచెందాడు. సుబ్బరాయుడుకి భార్య, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Read latest SPSR Nellore News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top