
ఆస్ట్రేలియాతో వన్డేలకు ఎంపిక చేసిన భారత జట్టుపై టీమిండియా మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ (Mohammed Kaif) పెదవి విరిచాడు. అజిత్ అగార్కర్ (Ajit Agarkar) నేతృత్వంలోని టీమిండియా సెలక్టర్లు ఓ ఆటగాడి విషయంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నారంటూ విమర్శించాడు. వెస్టిండీస్‌తో సొంతగడ్డపై జరుగుతున్న టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది.
మూడు వన్డేలు, ఐదు టీ20లు
ఇందులో భాగంగా అక్టోబరు 19 నుంచి ఆసీస్‌తో జరగనున్న వన్డే సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టు... 15న ఆస్ట్రేలియాకు బయలుదేరనుంది. న్యూఢిల్లీ నుంచి రెండు విడతలుగా మన ప్లేయర్లు పెర్త్‌కు చేరుకోనున్నారు.
ఈ పర్యటనలో భాగంగా టీమిండియా... ఆసీస్‌తో మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఇందుకోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇప్పటికే వన్డే, టీ20 జట్లను ప్రకటించిన విషయం తెలిసిందే.
సంజూ శాంసన్‌ను కాదని...
అయితే, వికెట్ కీపర్ కోటాలో కేఎల్ రాహుల్‌కు తోడుగా.. ధ్రువ్ జురెల్‌ను వన్డేలకు తొలిసారి ఎంపిక చేశారు సెలక్టర్లు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మెరుగైన రికార్డు ఉన్న సంజూ శాంసన్‌పై వేటు వేసి.. టెస్టుల్లో ఇరగదీస్తున్న జురెల్‌ను ఆసీస్ టూర్‌కు ఎంచుకున్నారు.
అతడి ఆట తీరు ఎంతో గొప్పగా ఉంది.. కానీ
ఈ నేపథ్యంలో కైఫ్ సెలక్టర్ల తీరును తప్పుబట్టాడు. ‘‘ఇటీవలి కాలంలో ధ్రువ్ జురెల్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ముఖ్యంగా వెస్టిండీస్‌తో తొలి టెస్టులో శతకంతో మెరవడం విశేషమే. అతడి ఆట తీరు ఎంతో గొప్పగా ఉంది.
భారత క్రికెట్‌కు ఆశాకిరణం అతడు. ప్రతి మ్యాచ్‌లోనూ చితక్కొట్టగల నైపుణ్యాలు అతడికి ఉన్నాయి. కానీ వన్డేల్లో సంజూ శాంసన్‌ను కాదని జురెల్‌ను ఎంచుకోవడం తప్పుడు నిర్ణయం. ఎందుకంటే.. సంజూ సాధారణంగానే లోయర్ ఆర్డర్‌లో ఆడతాడు.
వన్డేల్లో సంజూ గొప్ప ఆప్షన్
ఐదు లేదంటే ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడు. కాబట్టి జురెల్ కంటే వన్డేల్లో సంజూ గొప్ప ఆప్షన్ అవుతాడు. లోయర్ ఆర్డర్‌లో ముఖ్యంగా స్పిన్నర్లను ఎదుర్కోవడంలో సంజూ భేష్. సిక్సర్లు బాదగలడు.
ఒకవేళ ఆసీస్‌తో వన్డేలో అతడిని ఆడిస్తే.. ఆడం జంపా బౌలింగ్‌లో హిట్టింగ్ ఆడగల సత్తా అతడికి ఉంది. ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్ల వీరుల జాబితాలో సంజూ టాప్-10లో ఉన్న సంగతి మర్చిపోవద్దు.
ఆస్ట్రేలియా పిచ్ పరిస్థితులకు సంజూ ఐదు లేదంటే ఆరో స్థానంలో సరిగ్గా సరిపోతాడు. జురెల్ ఇటీవల మంచి ఫామ్‌లో ఉన్నాడు. అందుకోసం సంజూ వంటి నిలకడగా ఆడే బ్యాటర్లను పక్కన పెట్టడం సరికాదు.
వన్డే జట్టులో చోటుకు అతడు అర్హుడు’’ అని కైఫ్ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు మాత్రం సెలక్టర్లు సంజూను ఎంపిక చేయడం గమనార్హం.
రోహిత్‌పై వేటు వేసి.. గిల్‌కు పగ్గాలు
ఇక ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య పెర్త్ వేదికగా అక్టోబరు 19న తొలి వన్డే జరగనుంది. ఈ సిరీస్ నుంచి భారత వన్డే జట్టుకు కూడా శుబ్‌మన్ గిల్ సారథిగా వ్యవహరించనున్నాడు. ఇంగ్లండ్ టూర్‌లో టెస్టుల్లో మెరుగైన ప్రదర్శన చేసిన గిల్‌ను... తొలిసారి వన్డే జట్టుకు సారథిగా ఎంపిక చేశారు.
టెస్టు, టీ20 ఫార్మాట్‌లకు వీడ్కోలు పలికిన రోహిత్, కోహ్లి చాన్నాళ్ల తర్వాత తిరిగి మైదానంలో దర్శనమివ్వనున్నారు. కాగా వన్డే సారథిగా రోహిత్‌ను ఇప్పుడే తప్పించడాన్ని కైఫ్ ఇప్పటికే తప్పుబట్టిన విషయం తెలిసిందే.
చదవండి: అందుకే గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయాం.. తనొక అద్భుతం: భారత కెప్టెన్