One Day I Lost My Mind After Getting Out Through Bat Left Stadium: Sanju Samson - Sakshi
Sakshi News home page

Sanju Samson: ఆరోజు పిచ్చిపట్టినట్లయింది.. బ్యాట్‌ విసిరేసి వెళ్లిపోయా.. రాత్రి వచ్చి చూస్తే

Published Tue, May 3 2022 2:58 PM

Sanju Samson: One Day Lost My Mind After Getting Out Threw Bat Left Stadium - Sakshi

Sanju Samson Comments: కేరళ బ్యాటర్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టు కెప్టెన్‌ సంజూ శాంసన్‌.. ఐపీఎల్‌-2013, 2014 సీజన్లలో మంచి ప్రదర్శన కనబరిచి వెలుగులోకి వచ్చాడు. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ప్రతిభను నిరూపించుకుని సెలక్టర్ల దృష్టిని ఆకర్షించి 2015లో జింబాబ్వే పర్యటన సందర్భంగా భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. 

అలా సుమారు 20 ఏళ్ల వయస్సులో టీమిండియాకు సెలక్ట్‌ అయిన ఈ కేరళ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ నిలకడలేమి ఆట కారణంగా జట్టులో స్థానం సుస్థిరం చేసుకోలేకపోయాడు. అనేక పరిణామాల అనంతరం 25 ఏళ్ల వయసులో పునరాగమనం చేశాడు. తన జీవితంలో ఈ ఐదేళ్లు అత్యంత సవాలుతో కూడినవంటూ తాజాగా గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు.      

సంజూ నువ్వు చేయగలవు..
‘‘నాకు పందొమ్మిదీ... ఇరవయ్యేళ్ల వయసులో అనుకుంటా అరంగేట్రం చేశాను. ఆ తర్వాత మళ్లీ 25 ఏళ్ల వయసులో టీమిండియాకు సెలక్ట్‌ అయ్యాను. నా జీవితంలో ఈ కాలం అత్యంత క్లిష్టమైనది. కేరళ జట్టు నుంచి కూడా నన్ను తప్పించారు. ఎన్నెన్నో సవాళ్లు. అలాంటి సమయంలో కచ్చితంగా మన మీద మనకు నమ్మకం పోతుంది.

అయితే, నేను మాత్రం సంజూ నువ్వు మళ్లీ తిరిగి జట్టులోకి వస్తావు అని మనసుకు సర్దిచెప్పుకొన్నాను. జీవితంలో ఇలాంటి కఠిన దశలు ఎదురవుతూ ఉంటాయి. నిజాయితీ, నమ్మకంతో వాటిని అధిగమించగలం’’ అని బ్రేక్‌ఫాస్ట్‌ విత్‌ చాంపియన్స్‌ షోలో సంజూ వ్యాఖ్యానించాడు.

బ్యాట్‌ విసిరేసి, స్టేడియం వీడి..
‘‘అప్పట్లో నేను తొందరగా వికెట్‌ పోగొట్టుకునేవాడిని.. కోపం, విసుగు, చిరాకు వచ్చేవి. ఒకానొక సందర్భంలో డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వెళ్లగానే బ్యాట్‌ విసిరి పడేశాను. మ్యాచ్‌ జరుగుతుండగానే మైదానం వీడి బయటకు వచ్చేశాను. అది బ్రబౌర్న్‌ స్టేడియం. ఆనాడు నేను అవుటైన తీరు తీవ్రంగా నిరాశపరిచింది.

క్రికెట్‌ వదిలేసి.. ఇంటికి వెళ్లిపోదామనుకున్నా. బ్యాట్‌ అక్కడే పడేసి కేరళకు తిరుగు ప్రయాణం అవుదామనుకున్నా. కాసేపటి తర్వాత మెరైన్‌ డ్రైవ్‌కు వెళ్లి సముద్రాన్ని చూస్తూ నాలో నేనే ఆలోచించడం మొదలుపెట్టాను. రెండు గంటల పాటు అక్కడ కూర్చున్న తర్వాత రాత్రి తిరిగి వచ్చాను.

అప్పటికి మ్యాచ్‌ అయిపోయింది. డ్రెస్సింగ్‌ రూమ్‌లో చూస్తే నా బ్యాట్‌ విరిగి పడి ఉంది. నా మీద నాకే కోపం వచ్చింది. బ్యాట్‌ను కాకుండా పిల్లోను విసిరిపడేయాల్సింది అనుకున్నా’’ అని పశ్చాత్తాపపడ్డట్లు సంజూ పేర్కొన్నాడు. 

ఇక ఆ తర్వాత బ్యాటింగ్‌ మీద దృష్టి సారించి ముందడుగు వేసిన సంజూ.. టీమిండియాకు సెలక్ట్‌ అవడంతో పాటు.. ఐపీఎల్‌-2022లో రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌గా జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. బ్యాటర్‌గానూ రాణిస్తున్నాడు. ఆటలో నిలకడ కొనసాగిస్తే రానున్న టీ20 ప్రపంచకప్‌ టోర్నీ నేపథ్యంలో అతడు భారత జట్టుకు సెలక్ట్‌ అయ్యే అవకాశాలు లేకపోలేదు.

కాగా ఐపీఎల్‌ తాజా ఎడిషన్లో ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడిన సంజూ 298 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 55. ఇక అతడి నేత్వత్వంలోని రాజస్తాన్‌ ప్రస్తుతం 6 విజయాలు సాధించి 12 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్‌ రేసులో దూసుకుపోతోంది. 

IPL 2022: అంపైర్‌పై కోపంతో ఊగిపోయిన శాంసన్.. రివ్యూ కోసం సిగ్నల్‌

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement