
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో నిష్క్రమణకు అంచుల్లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఇవాళ (మే 5) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగబోయే డు ఆర్ డై మ్యాచ్‌కు ముందు కీలక ప్రకటన చేసింది. గాయపడిన స్మరణ్ రవిచంద్రన్ స్థానంలో విదర్భ లెఫ్డ్ ఆర్మ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హర్ష్ దూబేను జట్టులోకి తీసుకుంది.
హర్ష్‌ను బేస్ ధర రూ. 30 లక్షలకు సొంతం చేసుకుంది. కొద్ది రోజుల ముందే స్మరణ్ ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపాకు ప్రత్యామ్నాయంగా జట్టులోకి వచ్చాడు. స్మరణ్ ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే గాయంతో సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. అంతకుముందు జంపా రెండు మ్యాచ్‌లు ఆడి ప్రాక్టీస్ సందర్భంగా గాయపడ్డాడు.
Harsh Dubey joins the squad as a replacement for Smaran, who is ruled out due to injury.#PlayWithFire pic.twitter.com/Bd4vnLanGF
— SunRisers Hyderabad (@SunRisers) May 5, 2025
ఎవరీ హర్ష్ దూబే..?
పూణేలో జన్మించి, విదర్భ తరఫున దేశవాలీ క్రికెట్ ఆడుతున్న 22 ఏళ్ల హర్ష్ దూబే.. తాజాగా ముగిసిన రంజీ సీజన్‌లో (2024-25) రికార్డు స్థాయిలో 10 మ్యాచ్‌ల్లో 69 వికెట్లు (7 ఐదు వికెట్ల ప్రదర్శనలతో పాటు రెండు 10 వికెట్ల ప్రదర్శనలు) తీసి, రంజీ చరిత్రలోనే ఓ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించాడు.
హర్ష్ విదర్భ తరఫున 18 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 21 లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 16 టీ20లు ఆడి 128 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లో దాదాపు 100 పరుగులు చేశాడు. హర్ష్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 7 అర్ద సెంచరీలు, లిస్ట్-ఏ క్రికెట్‌లో 2 అర్ద సెంచరీలు సాధించాడు.
హర్ష్ అద్బుత ప్రదర్శన కారణంగా గత రంజీ సీజన్‌లో విదర్భ ఛాంపియన్‌గా నిలిచింది. విదర్భ రంజీ టైటిల్ గెలవడం ఇది మూడో సారి. ఫైనల్లో విదర్భ కేరళపై విజయం సాధించి, ఛాంపియన్‌గా అవతరించింది.
నిష్క్రమణ అంచుల్లో ఎస్‌ఆర్‌హెచ్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో గత సీజన్ రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శనలు చేస్తూ నిష్క్రమణ అంచుల్లో ఉంది. ఈ సీజన్‌లో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 7 పరాజయాలు చవిచూసి, పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ ఇంకా నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.
ఈ నాలుగు గెలిచినా సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్‌కు చేరడం అసంభవం. టెక్నికల్‌గా ఆ జట్టు ఇంకా ఎలిమినేట్ కాలేదు కానీ, ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ పని అయిపోయింది. ఇవాళ (మే 5) ఆ జట్టు సొంత మైదానంలో (ఉప్పల్ స్టేడియం) టేబుల్ ఫిఫ్త్ టాపర్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.