Elon Musk - Shubman Gill: ఎలన్‌ మస్క్‌.. స్విగ్గీని కొనేయండి.. గిల్‌ ట్వీట్‌! నువ్వు డెలివరీ బాయ్‌ అయితే!

IPL 2022: Shubman Gill Request Elon Musk Please Buy Swiggy Tweet Viral - Sakshi

Shubman Gill Request To Elon Musk Viral: టీమిండియా యువ బ్యాటర్‌, గుజరాత్‌ టైటాన్స్‌ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌ చేసిన ఓ ట్వీట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీని ఉద్దేశించి గిల్‌.. ప్రపంచ కుబేరుడు ఎలన్‌ మస్క్‌కు చేసిన విజ్ఞప్తి ఇందుకు కారణమైంది. అసలు విషయం ఏమిటంటే.. ఎలక్ట్రిక్‌ కార్ల సంస్థ టెస్లా, అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్‌ ఎక్స్‌ల అధిపతి అయిన మస్క్‌.. ఇటీవలే సామాజిక మాధ్యమ వేదిక ట్విటర్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో చాలా మంది తమ సమస్యలు ప్రస్తావిస్తూ ఆయనను ట్యాగ్‌ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ఈ జాబితాలో గిల్‌ కూడా చేరిపోయాడు. సరైన సమయంలో స్విగ్గీ ఫుడ్‌ డెలివరీ చేయడం లేదనీ.. దానిని మీరు కొనుగోలు చేయాలంటూ మస్క్‌ను గిల్‌ అభ్యర్థించాడు. కనీసం అప్పుడైనా వాళ్ల పద్ధతి మారుతుందేమోనని ట్విటర్‌ వేదికగా కామెంట్‌ చేశాడు. 

ఇక ఇందుకు స్పందించిన స్విగ్గీ కేర్స్‌.. ‘‘హాయ్‌ శుభ్‌మన్‌ గిల్‌. ట్విటర్‌ ఉన్నా లేకున్నా.. ఒకవేళ మీరు మా పోర్టల్‌లో ఆర్డర్‌ చేసినట్లయితే తప్పకుండా సరైన సమయంలో డెలివరీ అయ్యేలా చూస్తాం. మాకు మీరు నేరుగా మెసేజ్‌ చేయవచ్చు. వెంటనే స్పందించి మీకు సేవలు అందించగలం’’ అని పేర్కొంది. ఇందుకు గిల్‌ సానుకూలంగా స్పందించడంతో అతడికి కృతజ్ఞతలు తెలిపి సమస్యను పరిష్కరిస్తామని తెలిపింది.

ఇదిలా ఉంటే గిల్‌ చేసిన ట్వీట్‌ పట్ల నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. మరీ ఇంత చిన్న విషయానికే అంత ఎలన్‌ మస్క్‌ వరకు వెళ్లాలా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక స్విగ్గీ పేరిట ఉన్న ఓ ఫేక్‌ అకౌంట్‌ యూజర్‌ గిల్‌ ఆట తీరును ఉద్దేశించి.. ‘‘నీ టీ20 క్రికెట్‌ కంటే మేము వేగంగానే డెలివరీ చేస్తాం’’ అంటూ ట్రోల్‌ చేశారు.

మరో వ్యక్తి స్పందిస్తూ.. ‘‘నేను డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ను. కొన్నిసార్లు ట్రాఫిక్‌ సమస్యల వల్ల ఆలస్యం అవుతుంది. కావాలని ఎవరూ ఏ తప్పూ చేయరు. పరిస్థితిని అర్థం చేసుకుని మాట్లాడాల్సి ఉంటుంది’’ అని పేర్కొన్నాడు.

మరో ఎగ్జిక్యూటివ్‌ మాత్రం.. ‘‘నువ్వు ఒక్కసారి మా పొజిషన్‌లోకి వచ్చి చూడు.. ఎంత తొందరగా డెలివరీ చేస్తావో చూస్తాం’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇక మరికొంత మంది బయో బబుల్‌ ఉండి బయటి నుంచి ఆహారం తెప్పించుకుంటున్నావా గిల్‌ అని ప్రశ్నిస్తున్నారు.

కాగా ఐపీఎల్‌-2022లో భాగంగా ఆర్సీబీతో ఏప్రిల్‌ 30న గుజరాత్‌ టైటాన్స్‌ తలపడనుంది. ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్‌ జైత్రయాత్రలో గిల్‌ తన వంతు పాత్ర పోషించాడు. ఇప్పటి వరకు ఈ సీజన్‌లో 229 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు-  96.

చదవండి👉🏾IPL 2022:గుజరాత్‌ టైటాన్స్‌ వర్సెస్‌ ఆర్‌సీబీ.. విజయం ఎవరిది..?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top