స్టొయినిస్‌ ఆటలు సాగనివ్వని కుల్దీప్‌... లక్నోకు షాక్‌! | IPL 2022 RR Vs LSG: Rajasthan Beat Lucknow By 3 Runs Thrilling Victory | Sakshi
Sakshi News home page

IPL 2022: స్టొయినిస్‌ ఆటలు సాగనివ్వని కుల్దీప్‌... లక్నో జోరుకు బ్రేక్‌!

Apr 11 2022 7:34 AM | Updated on Apr 11 2022 3:22 PM

IPL 2022 RR Vs LSG: Rajasthan Beat Lucknow By 3 Runs Thrilling Victory - Sakshi

కుల్దీప్‌ సేన్‌ను అభినందిస్తున్న అశ్విన్‌, ప్రిసిద్‌ కృష్ణ(PC: IPL/BCCI)

IPL 2022 RR Vs LSG- ముంబై: ఐపీఎల్‌లో ‘హ్యాట్రిక్‌’ విజయాలతో దూసుకెళ్తున్న లక్నో సూపర్‌జెయింట్స్‌ జోరుకు బ్రేక్‌ పడింది. రాజస్తాన్‌ రాయల్స్‌ బౌలింగ్‌ ముందు లక్నో తలవంచింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్తాన్‌ 3 పరుగులతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.

హెట్‌మైర్‌ (36 బంతుల్లో 59 నాటౌట్‌; 1 ఫోర్లు, 6 సిక్సర్లు) శివమెత్తగా... జెయింట్స్‌ బౌలర్లు హోల్డర్, కృష్ణప్ప గౌతమ్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. తర్వాత లక్నో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసి ఓడిపోయింది. డికాక్‌ (32 బంతుల్లో 39; 2 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుగనిపించగా, ఆఖర్లో స్టొయినిస్‌ (17 బంతుల్లో 38 నాటౌట్‌; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రాయల్స్‌ను వణికించాడు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ యజువేంద్ర చహల్‌ (4/41), బౌల్ట్‌ (2/30) లక్నోను దెబ్బ తీశారు.  

విరుచుకుపడిన హెట్‌మైర్‌ 
పది ఓవర్లలో రాజస్తాన్‌ స్కోరు 67/4. బట్లర్‌ (13), సామ్సన్‌ (13), పడిక్కల్‌ (29; 4 ఫోర్లు), డసెన్‌ (4) డగౌట్‌కు తిరిగెళ్లారు. హెట్‌మైర్, అశ్విన్‌  (28 రిటైర్డ్‌హర్ట్‌; 2 సిక్సర్లు) ఆటతో జట్టు స్కోరు 16వ ఓవర్లో 100 దాటింది. ఇక మిగిలిన ఓవర్లలో హెట్‌మైర్‌ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 33 బంతుల్లో (1 ఫోర్, 4 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించాడు. అతని భారీషాట్లతో రాయల్స్‌ చివరి 3 ఓవర్లలోనే 50 పరుగులు చేసింది.

అనంతరం లక్నో ఆరంభంలో కోల్పోయిన వికెట్లతో ఉక్కిరిబిక్కిరైంది. బౌల్ట్‌ తొలి రెండు బంతుల్లో రాహుల్‌ (0), క్రిష్ణప్ప గౌతమ్‌ (0) పడగొట్టడం... తర్వాత వచ్చిన వారిని చహల్‌ స్పిన్‌తో కట్టిపడేయడం... హోల్డర్‌ (8), బదోని (5), కృనాల్‌ పాండ్యా (22) నిర్లక్ష్యం జట్టును ముంచేసింది. డికాక్‌ అవుటయ్యాక ఓటమికి సిద్ధమైన లక్నోకు ప్రసిద్‌ కృష్ణ వేసిన 19వ  ఓవర్లో స్టొయినిస్‌ 19 పరుగులు చేయడంతో గెలుపుపై ఆశ చిగురించింది.

చివరి ఓవర్లో లక్నో గెలుపునకు 15 పరుగులు అవసరమమయ్యాయి. ఆఖరి ఓవర్‌ వేసిన రాజస్తాన్‌ బౌలర్‌ కుల్దీప్‌ సేన్‌ వైవిధ్యమైన బంతులతో స్టొయినిస్‌ ఆటలు సాగనివ్వలేదు. కుల్దీప్‌ వేసిన తొలి బంతికి అవేశ్‌ ఖాన్‌ సింగిల్‌ తీయగా... తర్వాతి మూడు బంతుల్లో స్టొయినిస్‌ పరుగు చేయలేకపోయాడు. దాంతో లక్నో విజయ సమీకరణం 2 బంతుల్లో 14 పరుగులుగా మారిం ది. స్టొయినిస్‌ ఐదో బంతికి బౌండరీ... చివరి బంతికి సిక్స్‌ బాదినా లక్నోకు ఓటమి తప్పలేదు. 

చదవండి: IPL 2022: చెలరేగిన పృథ్వీ షా, వార్నర్‌.. ఢిల్లీ ధనాధన్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement