
భోజనశాలలు పూర్తి చేయరూ!
అసంపూర్తిగా నిర్మాణాలు● ఏళ్లు గడుస్తున్నా సాగని పనులు ● పర్యవేక్షించని అధికారులు ● ఐదింటికి గాను పూర్తయింది ఒక్కటే ● కోతులతో విద్యార్థుల ఇక్కట్లు
ఆరుబయటే భోజనాలు తింటూ ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల కోసం భోజనశాలల నిర్మాణాలు చేపట్టారు. కాని నిధుల కొరతతో అర్ధంతరంగా నిలిచిపోయాయి. అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల పనులు ముందుకుసాగడం లేదు. విద్యార్థులు ఆరుబయటే తింటూ ఇబ్బందులు పడుతున్నారు.
తొగుట(దుబ్బాక): మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా గత ప్రభుత్వం డైనింగ్ హాళ్ల నిర్మాణం చేపట్టింది. ఒక్కొక్క హాల్ నిర్మాణం కోసం రూ.14 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసింది. తొగుట, కాన్గల్, వెంకట్రావుపేట, ఎల్లారెడ్డిపేట, ఘనపురం, గుడికందుల గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 658 మంది చదువుకుంటున్నారు.
చేతులెత్తేసిన కాంట్రాక్టర్లు
పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు నిర్మాణ పనులు ప్రారంభించి మధ్యలోనే వదిలేశారు. ఒక్కొక్కరికి మూడు, నాలుగు హాళ్ల నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. దీంతో వారు పనులు సక్రమంగా పూర్తి చేయలేకపోయారన్న ఆరోపణలున్నాయి. వెంకట్రావుపేట, ఎల్లారెడ్డిపేట పాఠశాలల్లో గోడలు నిర్మించి పైకప్పు రేకులు వేశారు. గుడికందుల పాఠశాలలో పిల్లర్ల స్థాయిలో పనులు నిలిచిపోయాయి. ఒక్క తొగుట పాఠశాలలో పనులు పూర్తిచేసి గత యేడాది జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు మధ్యలోనే వదిలేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం వల్లే కాంట్రాక్టర్లు పట్టించుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కోతుల దాడులు
మండలంలోని అన్ని గ్రామాల్లో కోతుల బెదడ పెరిగింది. ఆరుబయట భోజనాలు చేసే విద్యార్థులపై కోతులు దాడికి దిగుతున్నాయి. దీంతో విద్యార్థులు భోజనం చేసే వరకు ఉపాధ్యాయులు కాపలాగా ఉండాల్సిన పరిస్థితి. విద్యార్థులను గాయపరిచి ప్లేట్లు ఎత్తుకుపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయని హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భోజనశాలల నిర్మాణాలు పూర్తిచేసి ఇబ్బందులు తొలగించాలని వారు కోరారు.

భోజనశాలలు పూర్తి చేయరూ!