
ఆగస్టులో ప్రారంభిస్తాం
ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని
నంగునూరు(సిద్దిపేట): రాష్ట్రంలోనే అత్యంత కెపాసిటీ కల్గిన ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నామని వ్యవశాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు వెల్లడించారు. ఆగస్టు మొదటి వారంలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. శుక్రవారం మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలసి తుమ్మల నంగునూరు మండలం నర్మేటలో నిర్మిస్తున్న ఫ్యాక్టరీ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్మాణం పనులపై ఆరా తీశారు. జిల్లా వ్యాప్తంగా సాగు విస్తీర్ణం, సాగు చేస్తున్న రైతుల వివరాలు, ఫ్యాక్టరీ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. చుట్టుపక్కల నాలుగు జిల్లాల నుంచి ఆయిల్‌పామ్ గింజలను సేకరించి ప్యాకింగ్ ఇక్కడే చేస్తారని ముగ్గురు మంత్రులకు వ్యవసాయ మంత్రి వివరించారు. అనంతరం మాట్లాడుతూ నర్మేటలో నిర్మిస్తున ఫ్యాక్టరీ 120 టన్నుల కెపాసిటీ కలిగి ఉందన్నారు. తెలంగాణకు గుండె కాయలా ఉన్న ఈప్రాంతంలో నిర్మిస్తున్న ఫ్యాక్టరీని ప్రతిష్టాత్మకంగా నిలుస్తుందన్నారు. రిఫైనరీ కోసం త్వరలోనే టెండర్లు పిలుస్తామన్నారు. నాడు గ్రౌండ్ లేవల్‌లో ఉన్న పనులను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే పనులు పూర్తి చేశామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి, అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, వ్యవసాయ, ఉద్యాన, ఆయిల్‌ఫెడ్ అధికారులు పాల్గొన్నారు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాం
మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు
ఫ్యాక్టరీని ఆకస్మికంగా పరిశీలించిన మంత్రులు