
పౌష్టికాహారం అందేలా చర్యలు
డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి
మిరుదొడ్డి(దుబ్బాక): జిల్లాలోని వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు మెనూ ప్రకారం మంచి పౌష్టికాహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మిరుదొడ్డిలోని కేజీబీవీ (కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం), మోడల్ స్కూల్ హాస్టల్‌ను శుక్రవారం ఆయన సందర్శించారు. హాస్టల్‌లోని వంట గదులను, స్టోర్ రూంలను పరిశీలించారు. పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్స్ అందించారా లేదా అని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. అలాగే హాస్టల్‌లో ఎదురవుతున్న ఇబ్బందులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య కరమైన వాతావరణంలో విద్యార్థులకు మంచి ఆహారాన్ని అందించాలని టీచర్లకు సూచించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీయడానికి టీచర్లు మంచి ప్రణాళికాబద్ధంగా బోధన చేయాలని ఆదేశించారు. టెన్త్ చదువుతున్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఇప్పటి నుంచే విజ్ఞానవంతమైన బోధన అందించేలా చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో ఎంఈఓ ప్రవీణ్‌బాబు, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ స్వర్ణలత, ఎమ్మార్సీ సిబ్బంది పాల్గొన్నారు.
వ్యాయామ విద్యకు ప్రాధాన్యం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): నేటి ఆధునిక కాలంలో వ్యాయామ విద్యకు ప్రాధాన్యత పెరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలో వ్యాయామ విద్య స్టాక్ రిజిస్టర్లను జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుంచే వ్యాయామంపై పట్టు సాధిస్తే సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చన్నారు. చిన్నారుల్లో పెరుగుతున్న ఊబకాయం, బద్దకం, తదితర సమస్యలకు వ్యాయామం పరిష్కార మార్గమన్నారు. కార్యక్రమంలో తోట సతీష్, హరికిషన్ తదితరులు పాల్గొన్నారు.