
మత్తు వదిలిద్దాం.. మహమ్మారిని తరిమేద్దాం
విద్యార్థులతో కలిసి ర్యాలీలో నడుస్తున్న కలెక్టర్, సీపీ, ఇతర అధికారులు
సిద్దిపేటఎడ్యుకేషన్/హుస్నాబాద్: ‘మత్తు పదార్థాలకు దూరంగా ఉందాం.. మహమ్మారిని తరిమేద్దాం.. మాదక ద్రవ్యాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు’ అని కలెక్టర్ హైమావతి పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని గురువారం జిల్లా వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు జరిగాయి. సిద్దిపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల(కోఎడ్యుకేషన్) నుంచి ఆయా పాఠశాలలు, కళాశాలల విద్యార్థులచే పాత బస్టాండ్ వరకు నిర్వహించిన ర్యాలీని సీపీ అనురాధతో కలిసి కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మత్తుకు బానిసలుగా మారిన వారికి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు బాధితులకు అవగాహన కల్పించాలన్నారు. స్నేహితులు, బంధువులు సన్మార్గాంలో నడిచేలా యువత బాధ్యతవహించాలన్నారు.
అవగాహన కల్పిస్తున్నాం
పోలీస్ కమిషనర్ అనురాధ మాట్లాడుతూ పాఠశాలల్లో గంజాయి, డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై వివరిస్తున్నట్లు చెప్పారు. ఎవరైనా డ్రగ్స్ కలిగి ఉన్నా, తీసుకున్నా వెంటనే టోల్‌ఫ్రీ నంబర్ 1908కు లేదా కంట్రోల్ రూమ్ నంబర్ 8712667100 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు. పాత బస్టాండ్ సర్కిల్ వద్ద డ్రగ్స్‌కు దూరంగా ఉంటామని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీకాంత్‌రెడ్డి, జిల్లా విద్యాధికారి శ్రీనివాస్‌రెడ్డి, పోలీస్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మన్నె రవీందర్‌రెడ్డి, అదనపు డీసీపీ సుభాష్‌చంద్రబోస్, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శాంతి తదితరులు పాల్గొన్నారు.
మానవహారం..
హుస్నాబాద్ పట్టణంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాదవద్రవ్యాల నిర్మూలన అందరి బాధ్యత అని అన్నారు. అంతకు ముందు విద్యార్థులు ర్యాలీగా వచ్చి అంబేడ్కర్ చౌరస్తాలో మానవహారం నిర్వహించారు. మాదక ద్రవ్యాల నివారణకు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, ఆర్డీఓ రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి
కలెక్టర్ హైమావతి పిలుపు
జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్‌పై కదంతొక్కిన జనం

మత్తు వదిలిద్దాం.. మహమ్మారిని తరిమేద్దాం