
పైరవీలకే పోస్టులు
మెరిట్ లిస్ట్ లేకుండానే..
అర్హత ఆధారంగా దరఖాస్తు చేసిన అభ్యర్థులతో సబ్జెక్ట్ నిష్ణార్థులు, ఎంఈవో, ఎస్‌వోల సమక్షంలో డెమో చెప్పించారు. క్లాస్ చెబుతుంటే ఎలాంటి వీడియో చిత్రీకరించలేదు. ఎలాంటి మెరిట్ లిస్ట్‌ను ప్రదర్శించకుండానే నేరుగా అభ్యర్థులకే సమాచారం అందించి సెలెక్ట్ చేశారు. దీంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంపికలు నిష్పక్షపాతంగా జరగలేదని పలువురు అభ్యర్థులు వాపోతున్నారు.
కేజీబీవీ (కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం) లలో గెస్ట్ లెక్చరర్ల నియామకాల్లో పైరవీలకే పెద్దపీట వేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధ్యాపకుల నియామకాల్లో అవకతవకలు జరిగినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. జిల్లాలో 9 కేజీబీవీలను జూనియర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేయంతో 42 గెస్ట్ లెక్చరర్ల నియామకం చేపట్టారు. అర్హులను కాకుండా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు చెప్పిన వారికే అవకాశాలు కల్పించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరోపిస్తున్నారు. ఉన్నత అధికారులు మరోసారి పరిశీలించాలని డెమోకు హజరైన అభ్యర్థులు కోరుతున్నారు.
16 కేజీబీవీలలో..
జిల్లా వ్యాప్తంగా 23 చోట్ల కేజీబీవీలుండగా గతేడాది వరకు ఏడు చోట్ల మాత్రమే ఇంటర్ విద్యను అందించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి మరో 9 కేజీబీవీలలో ఇంటర్మీడియెట్ విద్యను ప్రారంభించారు. దీంతో ఇంటర్ విద్యను అందించే కేజీబీవీలు 16కు చేరాయి. నూతనంగా ఇంటర్ విద్యను అందించేందుకు కొమురవెల్లి, వర్గల్, ములుగు, అక్కన్నపేట, హుస్నాబాద్, తొగుట, అల్లిపూర్(చిన్నకోడూరు) కేజీబీవీలలో బోధించేందుకు గెస్ట్ లెక్చరర్లను నియమించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఆయా కేజీబీవీల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేసి దరఖాస్తులు స్వీకరించారు. 42 గెస్ట్ లెక్చరర్ల పోస్టులకు దాదాపు 150కి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేశారు.
పైరవీలకే ప్రాధాన్యత
కేజీబీవీలలో గెస్ట్ లెక్చరర్ల ఎంపికల్లో పైరవీలకే ప్రాధాన్యత ఇచ్చారని తెలుస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక మాజీ ప్రతినిధులు చెప్పిన వారికే అవకాశాలు కల్పించారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు దృష్టి సారించి అవసరమైతే మరోమారు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్యాపకుల సమక్షంలో డెమో నిర్వహించి ఎంపికలు చేయాలని పలువురు అభ్యర్థులు కోరుతున్నారు. దీనిపై త్వరలో కలెక్టర్‌ను కలిసి న్యాయం చేయాలని కోరనున్నట్లు తెలుస్తోంది.
గెస్ట్ లెక్చరర్ల నియామకాల్లో అక్రమాలు
ఆయా సబ్జెక్టులకు 42 మంది నియామకం
మెరిట్ లిస్ట్ ప్రదర్శించకుండానే ఎంపికలు
అవకతవకలపై సర్వత్రా విమర్శలు
9 కేజీబీవీల్లో నూతనంగా ఇంటర్ విద్య ప్రారంభం
తొగుట, కొమురవెల్లిలో గెస్ట్ అధ్యాపకురాలి పోస్ట్‌కు ఓ మహిళా దరఖాస్తు చేశారు. రెండు చోట్లా ఎంతో కష్టపడి వేర్వేరుగా డెమో ఇచ్చారు. అయినా ఫలితం దక్కలేదు. అయితే ఎలాంటి మెరిట్ లిస్ట్ ప్రదర్శించకుండానే గెస్ట్ లెక్చరర్ల నియామకం చేపట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పైరవీలు చేసుకున్న అభ్యర్థులనే నేరుగా పిలిచి ఎంపిక చేశారని తెలుస్తోంది. పోస్టుల నియామకాల్లో జరిగిన అవకతవకలపై అధికారులు దృష్టి సారించాలని డెమోకు హాజరైన అభ్యర్థులు కోరుతున్నారు. – సాక్షి, సిద్దిపేట
పారదర్శకంగానే ఎంపికలు
కేజీబీవీలలో గెస్ట్ లెక్చరర్ల ఎంపికలు పారదర్శకంగా జరిగాయి.అవకతవకలకు అవకాశాలు లేవు. అభ్యర్థులు ఇచ్చిన డెమో ప్రకారం ఎంఈవో, ఎస్‌వో, ఆ సబ్జెక్ట్ నిష్ణార్థుడు సమక్షంలో ఎంపిక చేశారు
–శ్రీనివాస్‌రెడ్డి, డీఈఓ

పైరవీలకే పోస్టులు