
వడ్డీ రాకాసులు
చిన్నకోడూరు(సిద్దిపేట): ప్రైవేటు ఫైనాన్స్‌లు పేదల నడ్డి విరుస్తున్నాయి. పేద ప్రజల అమాకత్వాన్ని, అవసరాలను ఆసరాగా తీసుకుని అప్పులు ఇచ్చి వడ్డీల పేరుతో నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సిద్దిపేటకు చెందిన ప్రైవేటు ఫైనాన్స్‌లు గ్రామాల్లో వారం, నెల రోజులు వారీగా మిత్తీలకు ఇస్తూ పేదలను హింసుస్తున్నారు. మహిళల పేరు మీద మహిళా గ్రూపులు ఏర్పాటు చేస్తూ వారం చిట్టీలు నడిపిస్తున్నారు. పది మందిని ఒక గ్రూపుగా చేసుకుంటూ నెలలో ఒక మొదటి వారాన్ని ఎంచుకుని డబ్బులు వసూలు చేస్తున్నారు. పది మందిలో ఆపద ఉండి ఎవరైనా డబ్బులు చెల్లించలేకపోతే వారి ఇళ్లపై దౌర్జన్యాలకు దిగుతున్నారు. అధిక వడ్డీతో డబ్బులు వసూలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. చిన్నకోడూరు మండలం మాచాపూర్‌లో కుటుంబ కలహాలతో వారం క్రితం ఒక వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో అతను చెల్లించాల్సిన రూ.3 వేల కోసం గురువారం అతని ఇంటిపై సిద్దిపేటకు చెందిన ప్రైవేటు ఫైనాన్స్ సిబ్బంది దౌర్జన్యానికి దిగారు. అధికారులు స్పందించి ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రైవేటు ఫైనాన్స్‌ల ఆగడాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.
పేదల నడ్డి విరుస్తున్న ప్రైవేటు ఫైనాన్స్‌లు
వారి ఆగడాలను అరికట్టాలంటున్న ప్రజలు