
వసతి గృహాల్లో వసతులు కల్పించండి
యూఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు రవి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): రాష్ట్రంలోని ప్రభుత్వ వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించాలని భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (యూఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర అధ్యక్షుడు రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ అధికారి కార్యాలయంలో గురువారం వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతు నూతన విద్యాసంవత్సరం ప్రారంభమై 20 రోజులు గడుస్తున్నా హాస్టళ్లల్లో కనీస వసతులు కల్పించకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వ విద్య అభ్యసించడం అంటే సమస్యలతో సతమతమవడమనే విధంగా ఉందని విమర్శించారు. ప్రభుత్వాలు మారినా ప్రభుత్వ విద్యాసంస్థలు, హాస్టళ్లు మాత్రం మారడం లేదని ఆరోపించారు. విద్యా సంవత్సరం ప్రారంభంలో హాస్టల్ విద్యార్థులకు రావలసిన బెడ్డింగ్, స్టడీ మెటీరియల్స్ రాకపోవడంతో తల్లిదండ్రుల మీద అదనపు భారం పడుతుందన్నారు. కార్యక్రమంలో యూఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర నాయకుడు నాచారం శేఖర్, జిల్లా అధ్యక్షుడు గుడి కందుల రవి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.