
ఈసారీ లేనట్టే..!
చడీచప్పుడూలేని ‘ఫసల్ బీమా’
● పంటల సాగుకు మార్గదర్శకాలేవీ?
● అదిగోఇదిగో అంటూ ఊరిస్తున్న ప్రభుత్వం
● పంట నష్టానికి దేవుడే దిక్కు
‘ఫసల్ బీమా’ ఈసారీ కూడా అమలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. గతేడాది నుంచి అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్న ప్రభుత్వం.. ఈ సీజన్‌లో పంటల సాగుకు అదను దాటే పరిస్థితి రాబోతున్నా చడీచప్పుడూలేదు. ఈ సీజన్‌లో రైతుకు పంట నష్టం జరిగితే ‘దేవుడే దిక్కు’ అనే దుస్థితి నెలకొంది.
–గజ్వేల్
జిల్లాలో ఏటా వానాకాలంలో 5.50లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగులోకి వస్తుంటాయి. గతంలో పంటలకు నష్టం వాటిల్లినప్పుడు ‘ఫసల్ బీమా’ అమలు చేసేవారు. వానాకాలంలో సాగుచేసే ఆహార, నూనె గింజలు, వాణిజ్య, ఉద్యాన పంటలకు పంటల వారీగా, ప్రాంతాల వారీగా ప్రీమియం నిర్దేశించారు. అగ్నిప్రమాదం, పిడుగుపాటు, గాలివాన, వడగళ్లు, తుపాను, అనావృష్టి, వరదలు, నీట మునిగిపోవడం, తెగుళ్లు, ప్రతికూల వాతావరణం వల్ల దిగుబడులకు నష్టం వాటిల్లితే నష్ట పరిహారం చెల్లించేవారు. అంతేగాకుండా ప్రతికూల వాతావరణం కారణంగా రైతులు విత్తనాలు విత్తకపోవడం, నార్లు వేయకపోవడం వల్ల కలిగే ఆర్థిక నష్టాలకు బీమా మొత్తంలో 25శాతం వరకు సత్వర నష్టపరిహారం అందించే అవకాశం ఈ పథకంలో ఉండేది. పంట మధ్యకాలంలో నష్టపోయిన రైతులకు సైతం నష్టాన్ని అంచనా వేసి పరిహారంలో 25శాతం చెల్లించే అవకాశం. పంటల రకాలను బట్టి ప్రీమీయం చెల్లించేవారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ పథకం అమలయ్యేది. కానీ వివిధ కారణాలతో కొన్నేళ్లుగా ఈ పథకం నిలిచిపోయింది.
రైతుల ఆశలపై నీళ్లు..
రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని పునరుద్ధరించడానికి నిర్ణయించింది. గతేడాది నుంచే అమలు చేస్తామని కూడా ప్రకటించింది. కానీ ఈ సీజన్‌లోనైనా పథకం అమలవుతుందని అంతా భావించారు. కానీ రైతుల ఆశలపై నీళ్లు చల్లినట్టే కనపడుతోంది. ఈసారి వానాకాలం ఆరంభం నుంచే రైతులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. సీజన్ ఆరంభం నుంచి ఇప్పటివరకు భారీ వర్షామే లేకుండా పోయింది. జిల్లాలోని 23మండలాల్లో లోటు వర్షపాతం నెలకొంది. సుమారు 80వేల ఎకరాల్లో పత్తిని ఇప్పటికే సాగు చేశారు. మొక్కజొన్న విత్తనం కూడా జోరుగా వేస్తున్నారు. కానీ భూముల్లో పదును లేక విత్తనం మొలకెత్తడం లేదు. పత్తికి ఇప్పటికే భారీ నష్టం జరిగిపోయింది. మొక్కజొన్న పరిస్థితి ఇలాగే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ‘ఫసల్ బీమా’ అమలయి ఉంటే రైతులకు కొంత భరోసా ఉండేది. కానీ పరిస్థితి నేడు భిన్నంగా తయారైంది. నిజానికి జూలై 15లోగా పత్తి, మొక్కజొన్న ఇతర పంటలు సాగుచేసుకునే అవకాశముంది. ఆ తర్వాత వరి సాగుకు మరికొంత సమయం ఉంటుంది. కానీ ఇప్పటివరకు ‘ఫసల్’పై ఎలాంటి మార్గదర్శకాలు విడుదల కాకపోవడం.. ఈ సీజన్‌లో పథకం అమలయ్యే అవకాశం లేదని స్పష్టమవుతోంది.
మార్గదర్శకాలు రాలేదు
‘ఫసల్ బీమా’ అమలుకు సంబంధించి రైతుల నుంచి విజ్ఞప్తులు ఉన్నాయి. కానీ ఈ సీజన్‌లో అమలుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు అందలేదు. ఒకవేళ వస్తే రైతులకు సమచారమిస్తాం.
– రాధిక, జిల్లా వ్యవసాయాధికారి