
‘మల్లన్న’ జలాల కోసం ఉద్యమిస్తాం
దుబ్బాక: తలాపునే మల్లన్న సాగర్ జలాలు ఉన్నా సాగు నీటికి తిప్పలుతప్పడంలేదని, నీళ్లకోసం ఉద్యమిస్తామని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. బుధవారం దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి శివారులో దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లోని 12 గ్రామాలకు ఇర్కోడు లిప్టు ఇరిగేషన్ ద్వారా నీళ్లు అందించాలని జలసాధన సమితి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గానికి నీరు ఇవ్వకుంటే హైదరాబాద్‌కు మల్లన్నసాగర్ నుంచి వెళ్లే జలాలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. అవసరమైతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకై నా సిద్ధమేనని అన్నారు. కేసీఆర్ హయాంలో ప్రాజెక్టులు, ప్రధాన కాలువలు నిర్మిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఉప కాలువలు కూడా నిర్మించడం లేదన్నారు. ఏడాదిన్నర కాలంగా కాలువలు నిర్మించి పొలాలకు నీరందించాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. మల్లన్నసాగర్ నిర్మాణంతో సర్వం కోల్పోయామని, మా కడుపులు నిండిన తర్వాతనే బయటకు నీళ్లు తీసుకెళ్లాలన్నారు. ఇర్కోడు లిఫ్టు ఇరిగేషన్ ద్వార నీళ్లు ఇవ్వడంతో పాటు వెంటనే కాలువలు పూర్తి చేసి దుబ్బాక నియోజకవర్గానికి నీళ్లు అందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అవసరమైతే రాజీనామాకై నా సిద్ధమే
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి స్పష్టీకరణ
జలసాధన సమితి ఆధ్వర్యంలో సదస్సు