
అర్జీలు త్వరగా పరిష్కరించండి
● ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ చేయాలి
● అధికారులకు కలెక్టర్ ఆదేశం
● ప్రజావాణికి 186 దరఖాస్తులు
సిద్దిపేటరూరల్: జిల్లా వ్యాప్తంగా ప్రజావాణిలో ప్రజలు అందించిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ కె.హైమావతి అధికారులను ఆదేశించారు. అలాగే సంబంధిత వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచాలన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో జిల్లా అదనపు కలెక్టర్లు గరీమా అగర్వాల్, అబ్దుల్ హమీద్‌తో కలిసి కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. అంతకుముందు ఉదయం జిల్లా అధికారులతో ఇప్పటివరకు ప్రజవాణిలో స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారం, పెండింగ్ వివరాలు శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిపై నమ్మకం కలిగేలా దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆయా వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచాలన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి 186 దరఖాస్తులు వచ్చాయి.
టోకెన్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి..
అర్జీదారులు దరఖాస్తులు అందించేందుకు ఒక్కసారిగా రావడంతో హాలు కిక్కిరిసిపోయింది. దీంతో స్పందించిన కలెక్టర్ టోకెన్ సిస్టమ్ ఏర్పాటు చేసి క్రమానుసారంగా అర్జీలు స్వీరించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారి నాగరాజమ్మ, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
నూతన పెన్షన్ విధానం మాకొద్దు
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల పెన్షన్ రూల్స్‌కు సవరణలు చేస్తున్న క్రమంలో దాన్ని ఉపసంహరించాలని కోరుతూ ఆల్‌ఇండియా రాష్ట్ర పెన్షనర్ల ఫెడరేషన్ ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన పెన్షన్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టి పాస్ చేయించుకుని పెన్షన్ దారులకు తీవ్రమైన నష్టం కలిగించిందన్నారు. దేశంలోని పెన్షనర్లు నిరసన తెలుపుతూ కలెక్టర్లకు వినతిపత్రాలను అందించడం జరగుతుందన్నారు. హక్కులను భంగం కలిగించే ఈ నూతన పెన్షన్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నర్సింహారెడ్డి, సత్యనారాయణ, రవికుమార్, సిద్దారెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.