
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి
సిద్దిపేటజోన్: ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, లబ్ధిదారుల ఎంపికలో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని సీఐటీయూ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ కార్యాలయంలో అందచేశారు. అనంతరం సీఐటీయూ జిల్లా నాయకుడు రవికుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇస్తున్న ప్రభుత్వ సాయం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెంచాలని కోరారు. ప్రభుత్వ హామీ మేరకు ప్రతి మహిళకు రూ.2500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆసరా పథకం పింఛన్లు పెంచి ఇవ్వాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన కమిటీ అక్రమాలకు పాల్పడి అనర్హులను జాబితాలో చేర్చడం వల్ల అర్హులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. జిల్లా అధికారులు సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. రాజీవ్ యువ వికాస పథకం ద్వారా నిరుద్యోగులకు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మీ, కుమార్ బాబు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.