
పోక్సో నిందితుడికి ఏడాది జైలు
● రూ.25 వేల జరిమానా ● సిద్దిపేట మొదటి అదనపు సెషన్స్ కోర్టు తీర్పు
కొండపాక(గజ్వేల్): పోక్సో కేసులో ఓ నేరస్తుడికి ఏడాది పాటు సాధారణ జైలుశిక్షతోపాటు రూ.25 వేల జరిమానాను విధిస్తూ సిద్దిపేట మొదటి అదనపు సెషన్స్ కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. కొండపాక మండలంలోని దమ్మక్కపల్లి గ్రామంలో 2022 ఆగస్టులో ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ మైనర్ అమ్మాయిని నిందితుడు వెలికట్ట అనిల్ ఇంట్లోకి వెళ్లి చేయి పట్టి లాగి బూతు మాటలు తిడుతూ అసభ్యకరంగా వ్యవహరించాడు. దీంతో అప్పట్లో నిందితుడిపై పోలీస్టేషన్‌న్‌లో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించగా ఇప్పటివరకు పాటు సిద్దిపేట జిల్లా అదనపు కోర్టులో విచారణ జరిగిందని కుకునూరుపల్లి ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. బాధితుల తరఫున పబ్లిక్ పాసిక్యూటర్ ఆత్మరాములు వాదనలను వినిపించారు. వాదనల అనంతరం కోర్టు పైవిధంగా తీర్పునిచ్చింది. నిందితుడికి శిక్ష పడేలా వ్యవహరించిన కోర్టు కానిస్టేబుల్ లావణ్య, కోర్టు లైజనింగ్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్‌రెడ్డి, భరోసా కేంద్రం సిబ్బంది సౌమ్య, హరితలను కోర్టు అభినందించింది. త్వరలో వీరందరికీ బహుమతులను అందజేస్తామని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ పేర్కొన్నారు.