
ఎన్నికల వేళ నేతలకు కీలక బాధ్యతలు
● ఓటింగ్ శాతం పెంచుకునే దిశలో ప్రధాన పార్టీలు ● అధికార పార్టీలో నామినేటెడ్ పోస్టులపై ఆశలు ● మరోవైపు వర్గపోరుతో కార్యకర్తల్లో అయోమయం
సాక్షి, సిద్దిపేట: లోక్‌సభ ఎన్నికలు వివిధ పార్టీల నేతలకు అగ్నిపరీక్షలా మారాయి. ఆయా పార్టీల అభ్యర్థుల గెలుపు బాధ్యతలు అప్పగించడంతో ప్రచారంలో తలమునకలై ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలకు, అలాగే పోటీచేసి ఓడిపోయిన అభ్యర్థులకు ఆయా పార్టీలు కీలక బాధ్యతలు అప్పగించాయి. ఓటింగ్ శాతం పెంచేలా దిశానిర్దేశం చేశాయి. అధికార పార్టీ మరో అడుగు ముందుకు వేసి సక్సెస్ అయిన నేతలకు నామినేటెడ్ పోస్టులంటూ ఆశలు రేకెత్తిస్తోంది. దీంతో ఎవరికి వారు అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. అయితే కొన్ని చోట్ల క్షేత్రస్థాయిలో విభిన్న పరిస్థితులు నెలకొనడం గమనార్హం. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రాజకీయాలు రంజుగా మారాయి.
పట్టుదలతో కాంగ్రెస్ శ్రేణులు..
అధికార కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ గతంలో కంటే మెజారిటీ ఓట్లు సాధించి ఈ లోక్‌సభ ఎన్నికల్లో జెండా ఎగురవేయాలనే పట్టుదలతో కాంగ్రెస్ శ్రేణులు పయనిస్తున్నాయి. ఆరు చోట్ల ఓటమి చెందిన కాంగ్రెస్ అభ్యర్థులు ఈ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు సాధించేందుకు కృషి చేస్తున్నారు. వారంతా ఓటింగ్ శాతం పెంచుకొని నామినేట్ పోస్టులు దక్కించుకోవాలనే ఉత్సాహం కనబరుస్తున్నారు. సిద్దిపేటలోని కాంగ్రెస్ నేతలు వర్గాలుగా విడిపోయారు. ఇన్‌చార్జి మంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్ పలుమార్లు పర్యటిస్తున్నా ఆ నాయకులను ఏకం చేయలేకపోతున్నారని విమర్శలు ఉన్నాయి. దీంతో సిద్దిపేటలో కార్యకర్తలు ఎవరివైపు వెళ్లాలో తేల్చుకోలేకపోతున్నారు.
మోదీ నినాదంతో బీజేపీ నేతలు
అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధిని ప్రచారం చేస్తూ ‘మరో మారు మోదీ’ అనే నినాదంతో బీజేపీ నేతలు ముందుకెళ్తున్నారు. బీజేపీ నుంచి బరిలో ఉన్న మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు గెలుపు కోసం ఆ పార్టీలో అందరూ కష్టపడుతున్నారు. మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మెదక్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఆ పార్టీ శ్రేణులు ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నాయి.
నియోజకవర్గం బీఆర్‌ఎస్ కాంగ్రెస్ బీజేపీ
సిద్దిపేట 1,05,514 23,206 23,201
దుబ్బాక 97,879 25,235 44,366
గజ్వేల్ 1,11,684 32,568 66,653
మెదక్ 76,969 87,126 13,657
సంగారెడ్డి 83,112 74,895 20,921
పటాన్‌చెరు 1,05,387 98,296 19,963
నర్సాపూర్ 88,410 79,555 22,865
అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓట్లు ఇలా..
ఆరు చోట్ల బీఆర్‌ఎస్ గెలుపు
మెదక్ పార్లమెంట్ పరిధిలో 7అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అందులో బీఆర్‌ఎస్ ఆరు చోట్ల, కాంగ్రెస్ ఒక చోట గెలుపొందాయి. బీఆర్‌ఎస్ పార్టీ సిద్దిపేట నుంచి హరీశ్‌రావు, గజ్వేల్ ఎమ్మె ల్యేగా కేసీఆర్, దుబ్బాకలో కొత్త ప్రభాకర్ రెడ్డి, సంగారెడ్డి చింతా ప్రభాకర్, పటాన్‌చెరు మహిపాల్ రెడ్డి, నర్సాపూర్‌లో సునీతారెడ్డి, మెదక్ నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన మైనంపల్లి రోహి త్ గెలుపొందారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ పరిధిలో బీఆర్‌ఎస్ 6,68,955, కాంగ్రెస్ 4,20,881, బీజేపీ 2,11,626, ఇతరులు 1,36,435 ఓట్లు సాధించాయి.