
పట్టణ సరిహద్దులో చెత్త ఏరుతున్న పారిశుధ్య కార్మికులు (ఫైల్)
సిద్దిపేటజోన్: ఎవరూ చూడడం లేదుకదా అని రాత్రివేళ, తెల్లవారుజామున బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేశారో ఇక పని అయినట్టే... చెత్త రహిత పట్టణంగా మార్చే క్రమంలో సిద్దిపేట బల్దియా అనేక ప్రణాళికలు రూపొందించినా, బ్లాక్ స్పాట్స్ బెడద తగ్గడం లేదు. దీంతో ప్రత్యక్ష చర్యలకు సిద్ధమైంది. ఆరుబయట చెత్త వేసే వారిని సీసీ కెమెరాల ద్వారా గుర్తిస్తున్నారు. వారిని మున్సిపల్ కార్యాలయానికి రప్పించి కౌన్సెలింగ్ ఇచ్చే వినూత్న ప్రక్రియ చేపట్టారు. అందుకు పోలీస్, మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో సంయుక్తంగా ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిరంతరం నిఘా పెట్టారు. 43 వార్డుల్లో ఇంటింటికీ చెత్త సేకరణ వాహనాల ద్వారా వెళ్లి తడి, పొడి చెత్త సేకరిస్తున్నా కొన్ని ప్రాంతాలు, ప్రధాన కూడళ్లు, పట్టణానికి నలువైపులా సరిహద్దుల్లో రోడ్డు పక్కన చెత్త కుప్పలు(బ్లాక్ స్పాట్స్) దర్శనమిస్తున్నాయి. స్మార్ట్ సిటీ దిశగా అడుగులు వేస్తున్న బల్దియాకు బ్లాక్ స్పాట్స్ ప్రతిబంధకంగా మారాయి. దీనిని కట్టడి చేసేందుకు గతంలో మున్సిపల్ అధికారులు బ్లాక్ స్పాట్స్ ఏరియా ప్రాంతాలను గుర్తించి అక్కడ ముగ్గులు వేసి అందంగా సుందరీకరణ పనులు చేపట్టారు. ఒకదశలో వందకుపైగా ఉన్న బ్లాక్ స్పాట్స్ 40కి తగ్గాయి.
పట్టణ సరిహద్దుల్లో నిఘా..
బ్లాక్ స్పాట్స్ కట్టడి చర్యలు పటిష్టంగా అమలు చేస్తున్నా, పట్టణ సరిహద్దుల్లో చెత్తకుప్పలు పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి.మెదక్, కరీంనగర్, ముస్తాబాద్ రోడ్లు, పట్టణ చుట్టూ ఉన్న బైపాస్ రోడ్డు వెంట చెత్త కవర్లు గుట్టలుగుట్టలుగా ఉంటున్నాయి. విచ్చలవిడిగా బహిరంగంగా చెత్త వేస్తున్న వారిని కట్టడి చేసేందుకు మున్సిపల్‌శాఖ పోలీస్ శాఖ సహాయంతో వినూత్న మార్గం ఎంచుకుంది.
సీసీ కెమెరాల ద్వారా గుర్తింపు
పట్టణ సరిహద్దుల్లో బహిరంగంగా చెత్త వేస్తున్న వారిని సీసీ కెమెరాల ద్వారా గుర్తిస్తున్నారు. వారిని బల్దియా కార్యాలయానికి రప్పిస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం వారికి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు జరిమానా విధిస్తోంది. భవిష్యత్‌లో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండేందుకు హామీ తీసుకుంటున్నారు.